- హార్మూజ్ తరహాలో ఈ జలసంధిపై ఆంక్షలు విధించేలా చర్యలు?
- ఆందోళన కలిగిస్తున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ట్వీట్
- ప్రపంచ వాణిజ్యానికి ఈ జలసంధి అత్యంత కీలకం
- ఒకవేళ ఇరాన్ ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం!
టెహ్రాన్: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన వ్యూహాత్మక ఎత్తుగడలను మరింత ఉధృతం చేస్తోంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఆంక్షలు విధించిన ఆ దేశం.. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. హార్మూజ్ దిగ్బంధంతో ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలం అవుతుండగా.. తాజాగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
‘‘ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) , గోధుమలు, బియ్యం, ఎరువుల ఎగుమతుల్లో బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి వాటా ఎంత? ఏ దేశాలు, కంపెనీలు ఈ మార్గం ద్వారా అత్యధికంగా రవాణా చేస్తున్నాయి?” అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. కాగా, ఈ ప్రశ్నలు కేవలం గణాంకాల కోసం అడిగినవి కావని, ఆ మార్గాన్ని మూసివేయడం ద్వారా ఏయే దేశాలను, సంస్థలను దెబ్బకొట్టవచ్చో ఇరాన్ అంచనా వేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
- బాబ్ ఎల్-మాండెబ్ ఎందుకు అంత కీలకం?
బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలుపుతుంది. ఆసియా, యూరప్ మధ్య నౌకలు ప్రయాణించడానికి ఇది ప్రధాన మార్గం. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10%.. కంటైనర్ వాణిజ్యంలో 20-–25% ఈ సన్నని జలసంధి గుండానే జరుగుతుంది. ఈ జలసంధికి ఒకవైపు యెమెన్ ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ ఇప్పటికే అక్కడ పట్టు కలిగి ఉండటం అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తున్నది.
ఇప్పటికే హార్మూజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ బాబ్ ఎల్-మాండెబ్ వద్ద కూడా ఉద్రిక్తతలు పెరిగితే.. గోధుమలు, బియ్యంలాంటి నిత్యావసరాల సరఫరా నిలిచిపోయి ఆహార సంక్షోభం వస్తుంది. ఎరువుల రవాణా స్తంభిస్తుంది. నౌకలు
ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంతో సమయం, ఖర్చు విపరీతంగా పెరుగుతాయి.
- మానవతా సహాయానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్
తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన హార్మూజ్ జలసంధి గుండా మానవతా సహాయం, నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే నౌకల ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఇరాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య కార్యాలయం ఒక లేఖను విడుదల చేసింది. ప్రభుత్వం, సాయుధ దళాల ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్న ట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ వెల్లడించింది.
ఆహార ధాన్యాలు, మందులు, పశుగ్రాసం తీసుకెళ్లే నౌకలకు అనుమతి ఉంటుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ విధించిన ప్రత్యేక నిబంధనలను ఈ నౌకలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో వివిధ వాణిజ్య సంస్థలు తమ సరుకు రవాణా నౌకల ను ఇరాన్ దక్షిణ నౌకాశ్రయాలకు పంపేందుకు రెడీ అవుతున్నాయి.
