
- ఇజ్రాయెల్ తో వార్‌లో మాదే విజయం
- మళ్లీ మా జోలికొస్తే యూఎస్ కు
- భారీ మూల్యం తప్పదు
- యుద్ధంలో అమెరికా సాధించిందేమీ లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్
దుబాయ్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికాను చెంపదెబ్బ కొట్టామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. మళ్లీ తమపై దాడులు చేస్తే, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో తామే విజయం సాధించామని చెప్పారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక ఈనెల 19న అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఖమేనీ.. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత గురువారం తన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ఒక వీడియోలో మాట్లాడారు. ఇరాన్ అధికారిక టీవీ చానెల్ ఆ వీడియోను బ్రాడ్ కాస్ట్ చేసింది.
యుద్ధంలో జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ పూర్తిగా నాశనమైపోతుందని, అందువల్లే యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే, యుద్ధం వల్ల అమెరికాకు ఒరిగిన లబ్ధి ఏమీ లేదన్నారు. యూఎస్ కు సరెండర్ కావాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని, తాము లొంగిపోయే ప్రశ్నే లేదన్నారు. తమది శక్తివంతమైన దేశం అని పేర్కొన్నారు.
‘‘ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇస్లామిక్ రిపబ్లిక్ విజేతగా ఆవిర్భవించింది. ఇందులో జోక్యం చేసుకున్న అమెరికాను చెంపదెబ్బ కొట్టాం. అలాగే, ఖతార్ సమీపంలోని అమెరికా ఎయిర్ బేస్ పైనా దాడి చేశాం. మళ్లీ మా జోలికొస్తే, ఇలాగే స్పందిస్తాం. అమెరికా ఎయిర్ బేస్‌ల విషయంలో ఏం చేయాలో అది చేస్తాం. మాపై దురాక్రమణకు దిగితే, అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదు” అని ఖమేనీ వ్యాఖ్యానించారు.