ఇరాన్ దగ్గర మిస్సైల్స్ అయిపోయాయన్న ట్రంప్.. అదే టైంలో ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైల్స్ దాడులు

ఇరాన్ దగ్గర మిస్సైల్స్ అయిపోయాయన్న ట్రంప్.. అదే టైంలో ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైల్స్ దాడులు

ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ దగ్గర మిస్సైల్స్ దాదాపుగా అయిపోయాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇరాన్‌లో అమెరికా దళాలు విజయాన్ని సాధించాయని చెప్పారు. ఇరాన్ నౌకాదళం అంతమైందని, వైమానిక దళం నాశనమైందని, ఐఆర్‌జిసి కమాండ్ ధ్వంసమైందని ట్రంప్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

అమెరికా సైన్యం ఇరాన్‌లో లక్ష్యాలను దాదాపుగా తుడిచిపెట్టేసిందని ట్రంప్ తెలిపారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై బీభత్సమైన రీతిలో దాడులు చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. గ్యాస్ ధరల పెరుగుదల తాత్కాలికమేనని చెప్పారు. అమెరికాకు హార్మూజ్ అవసరం లేదని.. తాను ద్రోహులుగా చెప్పిన దేశాలు అమెరికా నుంచే చములు కొనుగోలు చేస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

యుద్ధం ఇప్పటికే గెలిచామని, దాదాపు ముగిసిపోయిందని చెప్పిన ట్రంప్.. అమెరికాకు, ప్రపంచానికి ఇరాన్ నుంచి పొంచి ఉన్న దుష్ట ముప్పును అంతం చేసే పనిలో ఉన్నామని తన ప్రసంగాన్ని ట్రంప్ ముగించారు. ఇరాన్ దగ్గర మిస్సైల్స్ అయిపోయాయని ట్రంప్ చెప్పిన మాటకు, వాస్తవానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రసంగం ముగిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ మిస్సైల్స్ దాడులను ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ముప్పును అడ్డుకోవడానికి రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.