ఆధార్ లింక్డ్ యూజర్లకే మెుదటి 15 నిమిషాల్లో టిక్కెట్ల జారీ.. రైల్వేస్ కొత్త రూల్..

ఆధార్ లింక్డ్ యూజర్లకే మెుదటి 15 నిమిషాల్లో టిక్కెట్ల జారీ.. రైల్వేస్ కొత్త రూల్..

అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఈ కొత్త మార్పుల ప్రకారం.. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సాధారణ టిక్కెట్లను రిజర్వ్ చేసుకునేందుకు తొలి 15 నిమిషాల పాటు కేవలం ఆధార్ ధృవీకరణ పూర్తిచేసుకున్న వినియోగదారులకు మాత్రమే అవకాశం కల్పించబడుతోంది. అంటే.. టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే తొలి 15 నిమిషాలు ఇతరులు సాధారణంగా టికెట్లు బుక్ చేసుకోవడానికే వీలుండదు. ఆధార్ లింక్ చేసి ధృవీకరణ చేయని వినియోగదారులు 15 నిమిషాల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకోవటానికి స్లాట్స్ ఓపెన్ అవుతాయి.

రైల్వేలు తీసుకొస్తున్న ఈ మార్పు బల్క్ బుకింగ్ ద్వారా మోసపోతున్న ప్రయాణికులను కాపాడనుంది. తత్కాల్ టికెట్ల కోసం ఇదే విధంగా ఆధార్ వెరిఫికేషన్ కచ్చితంగా ఉండాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ నియమం సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ విస్తరించింది ఐఆర్సీటీసీ. PRS కౌంటర్ల ద్వారా బుకింగ్ చేసుకునే వారికి ప్రత్యేక మార్పులు ఏమీ లేవు. అధికారిక టికెట్ ఏజెంట్లకు కూడా తొలిపది నిమిషాలు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అంటే ఇతరుల కంటే ముందుగా టిక్కెట్లు పొందటానికి ఆథార్ లింక్డ్ యూజర్లకు ముందస్తు అవకాశం అందుబాటులోకి రాబోతోంది.

ఈ మార్పు నిజమైన ప్రయాణికులకే టికెట్లు అందేలా చేస్తుంది. టికెట్ మాఫియా దందాలను అరికట్టనుంది. ఆధార్ ధృవీకృత వినియోగదారులు మాత్రమే ఈ సులభతరమైన బుకింగ్ పద్దతిలో ముందుగా సీట్లు పొందగలుగుతారు. కాబట్టి రైలు ప్రయాణం చేసేందుకు ముందుగా IRCTC ఖాతాలో ఆధార్ లింక్ చేసి, ధృవీకరణ పూర్తి చేసుకోవడం తప్పనిసరి అని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ కొత్త బుకింగ్ విధానం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం కలిగే అవకాశం ఉందని రైల్వై శాఖ చెబుతోంది. పైగా నిజమైన అవసరం ఉన్న వారికి సీట్లు త్వరగా లభిస్తాయి. సాధారణ ప్రయాణికులు ఈ మార్పుల గురించి ముందుగా తెలుసుకోవడం, సరైన సంసిద్ధతతో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం మంచి ప్రయోజనకరం.

►ALSO READ | నెలకు ఎంత దాస్తే రూ.5 కోట్లు కూడబెట్టొచ్చో తెలుసా..? 8-4-3 రూల్ గురించి తెలుసుకోండి

అంటే అక్టోబర్ 1 నుంచి IRCTC వెబ్‌సైట్, యాప్ ద్వారా రిజర్వేషన్ తొలి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ ధృవీకరణ ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇస్తూ, రైలు ప్రయాణాన్ని మరింత సాఫీగా, న్యాయవంతంగా అందించేందుకు ఈ తాజా చర్యలు ప్రారంభమయ్యాయి. ఆధార్ లింకింగ్ లేకపోతే తొలి 15 నిమిషాల్లో టికెట్ బుకింగ్ పొందడం కష్టం అవుతుంది. అందువల్ల IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ చేయడం అత్యవసరం అని రైల్వే శాఖ స్పష్టం చేసింది.