మొదలైన శ్రీ రామాయణ్ యాత్ర

మొదలైన శ్రీ రామాయణ్ యాత్ర

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చేపట్టిన శ్రీ రామాయణ్ యాత్ర నవంబర్ 7 ఆదివారం ప్రారంభమైంది. ప్రత్యేక రైలు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరింది. రామాయణం కథ జరిగిన ప్రముఖ ప్రదేశాలను సందర్శించడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. 12 రాత్రులు, 13 రోజుల పాటు యాత్ర జరుగుతుంది. ఢిల్లీ నుంచి బయల్దేరిన రైలు... శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యకు వెళ్తుంది. నందిగ్రామ్, జనక్ పూర్, సీతామఢి, వారణాసి, ప్రయాగ్ రాజ్, శ్రీంగవేర్పూర్, చిత్రకూట్, నాశిక్, హంపి మీదుగా రామేశ్వరం వెళ్తుంది. ఇక్కడితో యాత్ర ముగుస్తుంది. తిరిగి రైలు ఢిల్లీ వెళ్తుంది. మొత్తమ్మీద 17 రోజుల పాటు 7వేల 500 కిలోమీటర్ల మేరకు ఈ ప్రయాణం ఉంటుంది. ఈ యాత్ర కోసం ట్రైన్ లో 132 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ట్రైన్ లో ప్రయాణించడానికి రెండు కేటగిరీలను అందుబాటులో ఉంచారు. వాటిలో 1ఏసీ, 2ఏసీ కేటగిరీలున్నాయి. కాగా.. 1ఏసీలో ప్రయాణించాలంటే 1.02 లక్షలు, 2ఏసీలో ప్రయాణించాలంటే రూ. 83 వేలు చెల్లించాల్సిందే. ఇందులో ప్రయాణించేవారికోసం అన్ని వసతులను ఏర్పాటుచేశారు. రెస్ట్ రూం, టాయిలెట్స్, డైనింగ్ రూం, వెజ్, నాన్ వెజ్ ఫుడ్, సీసీటీవీలు, స్పెషల్ లాకర్స్ ఇలా కావలసిన సదుపాయాలన్నీ చేశారు.

కాగా.. ఔత్సాహికుల కోసం రెండో ట్రిప్ కూడా ఏర్పాటుచేశామని ఐఆర్‎సీటీసీ తెలిపింది. రెండో యాత్ర డిసెంబర్‎లో మొదలుకానుందని.. ఇప్పటికే దీనికి సంబంధించి బుకింగ్ కూడా ప్రారంభమైందని తెలిపారు.