భక్తులకు రైల్వే శాఖ సూపర్ గిఫ్ట్: ఒకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వెళ్లి రావొచ్చు...

భక్తులకు రైల్వే శాఖ సూపర్ గిఫ్ట్: ఒకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వెళ్లి రావొచ్చు...

హైదరాబాద్ నుండి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ఒక సూపర్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుండి ప్రతిరోజూ వేల మంది వెళ్తుంటారు. అలా వెళ్ళినవారు అక్కడికి దగ్గర్లోనే ఉండే అరుణాచలం కూడా వెళ్లాలనుకుంటారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుండి చర్లపల్లి – తిరుచిరాపల్లి మధ్య ఒక స్పెషల్ ట్రైన్ నడిచేది. ఇప్పుడు ఈ రైలును తాత్కాలికంగా కాకుండా శాశ్వత వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా అంటే వారానికి ఒకసారి నడిచే రైలుగా మార్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం.. 17077, 17078 నంబర్లతో ఈ రైలు జూలై 7వ తేదీ నుండి క్రమం తప్పకుండా నడుస్తుంది.

సాధారణంగా మన తెలుగు ప్రజలు తిరుపతితో పాటు అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను కూడా చూడాలని అనుకుంటారు. కానీ, ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఈ మూడు పుణ్యక్షేత్రాలను కలిపే  ఒక్క రైలు కూడా లేదు. దీనివల్ల భక్తులు వేర్వేరు రైళ్లు మారుతూ చాలా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా ఫ్యామిలీతో  వెళ్లేవారికి ఈ ప్రయాణం పెద్ద సమస్యగా ఉండేది. ఈ కష్టాలను గుర్తించిన రైల్వే శాఖ.. ఒకే రైలులో ఈ మూడు ప్రముఖ ఆలయాలను దర్శించుకునేలా ఈ సరికొత్త వీక్లీ ట్రైన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

చర్లపల్లి - తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 17077)
ఈ రైలు ప్రతి మంగళవారం సాయంత్రం 5:20 గంటలకు చర్లపల్లి నుండి  బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది. తరువాత రోజు అంటే బుధవారం ఉదయం 8:50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుమల ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లేవారికి ఈ టైమింగ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి.

►ALSO READ | జ్యోతిష్యం: జూన్ (2026) లో గ్రహా మార్పు.. మిథునరాశి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టే ఛాన్స్..!

తిరుపతి తర్వాత రేణిగుంట, చిత్తూరు, కాట్పాడి మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై) చేరుకుంటుంది. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్కడి నుండి విల్లుపురం, విరుద్దాచలం, అరియలూర్, శ్రీరంగం( శ్రీ రంగనాథస్వామి ఆలయం) మీదుగా బుధవారం సాయంత్రం 6:45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది.  

తిరుగు ప్రయాణం: తిరుచిరాపల్లి - చర్లపల్లి (ట్రైన్ నంబర్: 17078)
మళ్లీ హైదరాబాద్ రావడానికి ఈ రైలు ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు తిరుచిరాపల్లిలో బయలుదేరి  శ్రీరంగం, అరుణాచలం, తిరుపతి మీదుగా ప్రయాణించి గురువారం రాత్రికి చర్లపల్లి చేరుకుంటుంది.