టీ20 వరల్డ్ కప్ 2022లో హ్యాట్రిక్

టీ20 వరల్డ్ కప్ 2022లో హ్యాట్రిక్

ధనాధన్ క్రికెట్లో బ్యాట్స్మన్ దే హవా. ఎలాంటి బౌలర్ అయినా...దంచికొట్టుడే. అందుకే ఇది ధనాధన్ క్రికెట్ అయింది. అయితే టీ20 ఫార్మాట్లో  బౌలింగ్లో రాణించడం మామూలు విషయం కాదు. ముఖ్యంగా వికెట్లు పడగొడుతూ..బ్యాట్స్మన్పై పైచేయి సాధించడం నిజంగా బౌలర్ టాలెంట్ అని చెప్పాలి. అయితే మొత్తం మ్యాచులో రెండు, మూడు వికెట్లు తీసుకుంటే ఒక ఎత్తయితే...ఒక ఓవర్లో వరుసగా మూడు వికెట్లు తీసుకుంటే మాత్రం హైలెట్. అందుకే టెస్టు, వన్డే ఫార్మాట్లలో హ్యాట్రిక్ కంటే..టీ20ల్లో హ్యాట్రిక్కు కొద్దిగా స్పెషల్. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో మరో హ్యాట్రిక్ నమోదైంది. న్యూజిలాండ్, ఐర్లాండ్ మ్యాచులో ఐర్లాండ్ బౌలర్ జాష్ లిటిల్ హ్యాట్రిక్ తీశాడు.

లిటిల్ దెబ్బకు కూప్పకూలింది..
అడిలైడ్ వైదికగా జరిగిన న్యూజిలాండ్-ఐర్లాండ్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదైంది. మొదట్లో దుమ్మురేపిన న్యూజిలాండ్....లాస్ట్ ఓవర్లల్లో ఐర్లాండ్ దెబ్బకు కుప్పకూలిపోయింది. ముఖ్యంగా జాష్ లిటిల్.. తన బౌలింగ్‌లో కివీస్ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టాడు.  200లకు పైగా స్కోర్ సాధించేలా దూసుకెళ్తోన్న న్యూజిలాండ్ స్కోర్ బోర్డుకు కళ్లెం వేశాడు. ఫలితంగా 6 వికెట్లకు 185 పరుగుల వద్దే నిలిచిపోయింది. 

 

19వ ఓవర్లో మ్యాజిక్..
19వ ఓవర్‌లో జాష్ లిటిల్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. ఓవర్  రెండో బంతికి కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ పంపించాడు. మిడిల్ స్టంప్ మీద పడి ఇన్ స్వింగ్ అయిన బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా షాట్ ఆడాడు. అయితే టైమింగ్ మిస్ అవడంతో ..బంతి గాల్లోకి లేచి డెలానీ చేతుల్లో పడింది. మూడో బంతికి జేమ్స్ నీషమ్ అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్‌‌పై పిచ్ అయిన బంతి నీషమ్ ప్యాడ్స్‌ను తాకడంతో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి శాంట్నర్ కూడా అదే తరహాలో పెవీలియన్ చేరాడు. దీంతో లిటిల్ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్లో  2022లో హ్యాట్రిక్ నమోదు కావడం ఇది రెండోసారి. ఇదే టోర్నీలో గ్రూప్ మ్యాచ్‌లో UAE బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. శ్రీలంకపై మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లను ఔట్ చేశాడు. 

హ్యాట్రిక్ వీరులు ఆరు మంది...
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఆరు మంది బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీశారు. 2007 ప్రపంచకప్‌ తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ బంగ్లాదేశ్‌పై ఈ ఘనతను సాధించాడు. ఆ తరువాత 2021 టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. 2021లో ఐర్లాండ్ బౌలర్ కుర్టీస్ క్యాంఫర్ నెదర్లాండ్స్‌పై వరుసగా నాలుగు బంతుల్లో నలుగురిని అవుట్ చేశాడు. ఇదే టోర్నీలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ కూడా హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. 2021 వరల్డ్ కప్లోనే దక్షిణాఫ్రికా బౌలర్ కగిసొ రబడ ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు.