ఇంగ్లాండ్కు పసికూన ఐర్లాండ్ షాక్

ఇంగ్లాండ్కు పసికూన ఐర్లాండ్ షాక్

టీ 20 వరల్డ్ కప్లో మాజీ ఛాంపియన్  ఇంగ్లాండ్ కు పసికూన ఐర్లాండ్ షాకిచ్చింది. మెల్ బోర్న్లో జరిగిన సూపర్ 12 పోరులో అంగ్లేయులను ఐర్లాండ్ డక్ వర్త్ లూయిస్ విధానంలో 5  పరుగుల తేడాతో విజయం సాధించింది. 158 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ .14.3 ఓవర్లలో  5 వికెట్లకు 105 చేసింది. ఈ సమయంలో భారీ వర్షం రావడంతో..అంపైర్లు డక్ వర్త్ లూయిస్ ప్రకారం..ఐర్లాండ్ గెలిచినట్లు ప్రకటించారు. 

అండగా నిలిచిన ఆండీ..
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండీ బాల్బీరైన్(62) హాఫ్ సెంచరీతో సాధించగా.... లోర్కాన్ టక్కర్ 34 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు చెలరేగడంతో...ఐర్లాండ్  11 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.  103 పరుగుల వద్ద టకర్‌ను రనౌట్‌ అవ్వడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. మరికాసేపటికే హ్యారీ టెక్టార్‌ డకౌట్‌ అయ్యాడు. 132 వద్ద బాల్‌బిర్నేతో పాటు జార్జ్‌ డాక్రెల్‌  ఔటవ్వడంతో ఐర్లాండ్‌కు వరుస షాకులు తగిలాయి. ఆఖర్లో సామ్‌ కరణ్‌ వికెట్లు తీయడంతో ఐర్లాండ్‌ 19.2 ఓవర్లకు 157కే కుప్పకూలింది.  ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ , లివింగ్ స్టోన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్ 2 వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ పడింది.

తడబ్యాటు...
158 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరవకముందే జోస్‌ బట్లర్‌ను జోష్ లిటిల్‌ ఔట్‌ చేశాడు.  ఆ తర్వాత 14 పరుగుల వద్ద అలెక్స్‌ హేల్స్‌నూ  పెవిలియన్‌ చేర్చాడు. కొద్దిసేపటి తర్వాత బెన్‌ స్టోక్స్‌  నిష్క్రమించాడు.  ఈ సమయంలో  హ్యారీ బ్రూక్‌ (6) అండతో డేవిడ్‌ మలన్‌  జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మలన్ 35 పరుగులు సాధించాడు. 11 ఓవర్లో హ్యారీబ్రూక్‌, 14వ ఓవర్లో మలన్‌ ఔటవ్వడంతో  రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. అయితే  మొయిన్‌ అలీ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినా..అతని ప్రయత్నాలకు వరుణుడు అడ్డం పడ్డాడు. భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.  డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్  గెలవాలంటే 110 పరుగులు చేయాల్సి ఉండగా 105 పరుగల వద్దే నిలిచిపోయింది. దీంతో అంపైర్లు 5 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ విజయం సాధించినట్లు  ప్రకటించారు.