ఐరన్​బాడీ కావాలంటే ఇవి తినాల్సిందే..!

ఐరన్​బాడీ  కావాలంటే ఇవి తినాల్సిందే..!

మహిళలకు 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.

గర్భిణీలు రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాలి.

50 ఏళ్లు పైబడిన వారికి 8 మిల్లీగ్రాముల ఐరన్ సరిపోతుంది.

పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి ఐరన్ పుష్కలంగా అందుతుంది.

పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌‌‌‌లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

మన శరీరానికి నిత్యం అందాల్సిన ఐరన్‌‌లో 25 శాతం టమాటాల నుంచి పొందొచ్చు.

‘ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు ఉన్న వందమంది యువకులను నాకప్పగిస్తే.. ఈ దేశ చరిత్రనే మార్చేస్తా’ అన్నాడు వివేకానందుడు.
 శరీరం అనేది చైతన్యంగా ఉండాలి. అది కూడా ఉక్కులా దృఢంగా ఉండాలి అని. అలా ఉండాలంటే ఏం చేయాలి?

బంగారం కోసం ఎందుకు పరుగులు తీస్తారు మీరు.. ? నీలోనే ఐరన్​ ఉంటే.. వెనిస్​ వరకు పరిగెత్తగలవు. ఐరన్​ నిన్ను మెరిపిస్తుంది. బంగారం కంటే ఎక్కువ విలువనిస్తుంది. అందుకే.. అందరూ.. ఐరన్​ ఉన్న ఫుడ్​ తినండి. అందం కోసం, ఆరోగ్యం కోసం.. ఐరన్​ తినండి. బంగారాన్ని మించిన మెరుపు పొందండి. మీ ఒంట్లోని ఐరన్​.. బంగారం కంటే విలువైనది’ అంటూ ధన త్రయోదశి నాడు.. స్త్రీధన్​ పేరుతో వైరల్​ అయిన వీడియో గుర్తుందా? చాలా తక్కువ టైంలో ఎక్కువ మందికి ఐరన్​ మీద అవగాహన కల్పిస్తూ షేర్​ అయిన వీడియో అది. ఇంతకీ మీరు ఆ వీడియో చూశారా? చూసి పాటిస్తున్నారా? లేక అన్ని వీడియోల్లాగే దాన్ని కూడా చూసి లైట్​ తీసుకున్నారా? ఒకవేళ లైట్​ తీసుకున్నట్టయితే.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పట్నించి ఐరన్​ కంటెంట్​ పుష్కలంగా దొరికే ఫుడ్​ తినడం మొదలుపెట్టండి.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు శరీరానికి అవసరమయ్యే ఫుడ్​ అందాల్సిందే. దృఢంగా ఉండాలన్నా.. కండరాలు సక్రమంగా ఉండాలన్నా ముఖ్యమైన ఖనిజ లవణాల్లో ఐరన్​ ఒకటి. దృఢంగా ఉన్నవాళ్ల బాడీకి ఐరన్​ కంటెంట్ కావాల్సినంత అందుతుంది. మరి మామూలుగా అయితే ఏం తినాలి? ఏ ఫుడ్​లో ఎంత ఐరన్​ ఉంటుంది?

మన శరీరంలో ఎర్ర రక్త కణాల నిర్మాణానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ తగినంతగా లేకపోతే రక్తం తయారుకాదు. దీంతోపాటు పలు జీవక్రియలకు ఆటంకం కలుగుతుంది. ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గి శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. ఫలితంగా తీవ్రమైన అలసట, చర్మం తెల్లగా పాలిపోయినట్లు కనిపించడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలనొప్పి, అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం, వెంట్రుకలు, చర్మం పొడిబారడం, నాలుక వాయడం, పగలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కింద చెప్పిన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో    ఐరన్ లోపాన్ని సరిచేయొచ్చు.

​ఆకుకూరలు

ఆకు కూరల వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. పోషక పదార్థాల కోసం ఆకుకూరలు తినమని చెప్తారు డాక్టర్లు. అయితే.. ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ – సి ఆకు కూరల్లో కావాల్సినంత ఉంటుంది. విటమిన్​ – సి శరీరంలో ఐరన్​ని రెట్టింపు చేస్తుంది. అంతేకాదు.. యాంటీ ఆక్సిడెంట్స్​​ కూడా ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. ఐరన్​ గురించి చెప్పాలంటే.. ఐరన్​ అంటూ లేని ఆకుకూరలే ఉండవు. అందుకే.. ఆకుకూరలు తింటే.. శరీరానికి కావాల్సిన ఐరన్​ అందుతుంది.

నట్స్​

శరీరంలో పోషకాల శాతం తగ్గిందని తెలియగానే… డాక్టర్లు ముందుగా చెప్పేమాట ‘నట్స్​ తినండి’ అని. బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, వాల్​నట్స్​, పల్లీలు, జీడిపప్పు లాంటి నట్స్​ క్రమం తప్పకుండా తింటే చాలా తక్కువ టైమ్​లో ఆరోగ్యం పుంజుకుంటుంది. అందుకే.. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు రెగ్యులర్​గా నట్స్​ తింటారు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు, క్యాల్షియం లాంటి ప్రొటీన్స్​తో పాటు.. బాడీలో ఐరన్​ని పెంచే గుణాలు నట్స్​లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. వీలైనంత వరకు నట్స్​ తినడం అలవాటు చేసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.

గుడ్లు

అటు ఆరోగ్య నిపుణులు, ఇటు ఆహార నిపుణులు ఇద్దరూ రిఫర్​ చేసే సూపర్ ఫుడ్​ గుడ్డు. సకల రోగాలను తట్టుకోగల బలమైన ఆహార పదార్థం గుడ్డు మాత్రమే. ఇది ఉందీ.. అది లేదు అనే మాటే లేకుండా.. అన్ని రకాల ప్రొటీన్లు గుడ్డులో ఉన్నాయి. హై క్వాలిటీ ప్రొటీన్స్​, విటమిన్స్​, మినరల్స్​, శరీరానికి మేలు చేసే ఆమ్లాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఐరన్​ విషయానికొస్తే.. మిగతా వాటికంటే ఒక ఆకు ఎక్కువే చదివి.. ఐరన్​ అంటే ఎగ్​ అనిపించుకుంది.

రక్తహీనతతో బాధపడేవారికి కోడిగుడ్డు పరమౌషధం. రోజుకు రెండు గుడ్లు తింటే.. రక్త హీనతకు చాలా తక్కువ టైమ్​లో చెక్​ పెట్టొచ్చు. ప్రతిరోజూ బ్రేక్​ఫాస్ట్​లో ఉడికించిన గుడ్డు తింటే.. బాడీలో ఐరన్​ శాతం దానంతటదే పెరిగిపోతుంది.

చిక్కుళ్లు..

ఎన్నో పరిశోధనలు బల్లగుద్ది మరీ చెప్పిన ముచ్చట ఏంటంటే.. చిక్కుడు జాతి గింజలకు రక్తహీనతకు చెక్​ పెట్టగల శక్తి వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందని. రోజుకు అరకప్పు చిక్కుడు జాతి గింజలు అంటే.. బొబ్బర్లు, చిక్కుడు, కందులు, శెనగలు, బఠానీల వంటి గింజలు ఉడకబెట్టి తింటే.. శరీరానికి కావాల్సిన 20 శాతం ఐరన్​ లభిస్తుంది.

డార్క్​ చాక్లెట్​

చాక్లెట్​ తింటే మనకు తెలియకుండానే.. మన శరీరానికి కావాల్సిన ఐరన్​ని చాక్లెట్​ రూపంలో అందిస్తున్నట్టే. అవును..ఒక్క ఔన్సు డార్క్​ చాక్లెట్​లో 3.3 గ్రాముల ఐరన్​ ఉంటుంది. అంటే.. శరీరానికి కావాల్సిన ఐరన్​ కంటెంట్​లో 19 శాతం ఒక్క డార్క్​ చాక్లెట్​ బైట్​లో లభిస్తుందన్నమాట. ఎన్నో అధ్యయనాలు కూడా.. రక్తహీనతకు చెక్​ పెట్టాలంటే డార్క్​ చాక్లెట్​ తినాలని సూచించాయి. బాడీలో ఐరన్​ తక్కువ ఉన్నవాళ్లు రోజుకో బైట్​ డార్క్​ చాక్లెట్ తింటే.. సమస్య తగ్గుతుంది.