నారాయణపేట - కొడంగల్​ ఎత్తిపోతలకు లైడార్​ సర్వే షురూ

నారాయణపేట - కొడంగల్​ ఎత్తిపోతలకు లైడార్​ సర్వే షురూ
  • ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచిన నీటిపారుదల శాఖ

కొడంగల్​, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ నారాయణపేట –- కొడంగల్​ఎత్తిపోతల పనుల్లో నీటిపారుదల శాఖ వేగం పెంచింది. ప్రాజెక్టు గ్రౌండ్​రిపోర్టుతో పాటు ఎత్తిపోతల, అప్రోచ్​కాలువలు, చెరువుల సామర్థ్యం, ప్రెషర్​మెయిన్​మార్గం, జలాశయాల నిర్మాణం వంటి సమగ్ర అంచనాకు లైడార్​ సర్వే పనులు షురూ చేసింది. గురువారం హెలికాప్టర్ కొడంగల్​కు వచ్చింది. కొడంగల్​, నారాయణపేట, మక్తల్​ సెగ్మెంట్లలో సర్వే పనులు చేపట్టనుంది.  కొడంగల్​ కేంద్రంగా 10 రోజుల పాటు లైడార్​సర్వే ద్వారా ప్రాజెక్ట్   స్టేటస్ తెలియనుంది. రూ. 3,445 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయి.  

పనులకు సీఎం రేవంత్​రెడ్డి శంఖుస్థాపన చేశారు. రాజీవ్​– భీమా పథకం నుంచి 7టీఎంసీలు, భూత్పూర్ జలాశయం నుంచి 7 టీఎంసీల మిగులు జలాలను ఎత్తి పోస్తారు. ఊట్కూర్​, మక్తల్​, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, దౌల్తాబాద్​, కోస్గి, మద్దూర్​, కొడంగల్​, బొంరాస్​పేట మండలాల్లోని లక్ష 30వేల ఎకరాల్లో సాగు, తాగు నీరందనుంది. లైడార్​సర్వే అనంతరం టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు  నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయితే కొడంగల్​, నారాయణపేట, మక్తల్​ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి.