
- కృష్ణాలోనే వరదలు.. గోదావరిలో డల్
- ప్రస్తుతం రెండు బేసిన్లలో కలిపి 128 టీఎంసీలే ఉన్నయి
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ప్రస్తుత వరదలకు అనుగుణంగా 39 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వాలని ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం కృష్ణ బేసిన్ లోనే వరదలు ఉండడం, గోదావరి బేసిన్లోని ప్రాజెక్ట్ లకు వరదలు లేకపోవడం.. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి తక్కువ ఆయకట్టుకే నీళ్లివ్వాలని భావిస్తున్నది. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్‌సీఐఈఏఎం) ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, సీఈ రఘునాథరావు నేతృత్వంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది.
అందులో భాగంగా ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై చర్చించారు. సంబంధిత యాక్షన్‌ప్లాన్‌పై టెరిటోరియల్ వారీగా ఆయా చీఫ్ ఇంజనీర్ల నుంచి ఈఎన్సీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణ, గోదావరి బేసిన్లలోని అన్ని ప్రాజెక్టులు కలిపి తాగునీటి అవసరాలు పోనూ 128.4065 టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా కృష్ణా బేసిన్లోని సాగర్ ప్రాజెక్టులో మాత్రమే 41 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణ బేసిన్లో 18 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
గోదావరి బేసిన్లో ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరులకు వరద ప్రవాహం లేక ఇంకా నిండలేదు. దీంతో గోదావరి బేసిన్ లో ప్రస్తుతానికి 6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇటు.. కృష్ణ, గోదావరి బేసిన్లలోని చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద మరో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే రెండు మూడు వారాల తర్వాత మరోసారి దీనిపై రివ్యూ చెయ్యాలని అధికారులు భావిస్తున్నారు. అప్పటికి గోదావరికి మంచి వరదలు వచ్చి ప్రాజెక్టులు నిండితే నీళ్లివ్వాల్సిన ఆయకట్టు వివరాల్లో మార్పులు చేయనున్నారు.