
- అఫోర్డబుల్ ఇండ్లపై స్టాంప్ డ్యూటీ తగ్గాలి: నరెడ్కో అధ్యక్షుడు హరిబాబు
న్యూఢిల్లీ: రూ.45 లక్షల లోపు ధర కలిగిన అఫోర్డబుల్ ఇండ్ల డిమాండ్ పెంచేందుకు, వీటి సరఫరా మెరుగుపరిచేందుకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని రియల్టర్స్ ఆర్గనైజేషన్ నరెడ్కో రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ సంస్థ అధ్యక్షుడు జి. హరి బాబు మాట్లాడుతూ, భూమి, నిర్మాణ ఖర్చులు పెరగడంతో రూ.45 లక్షల లోపు అపార్ట్‌మెంట్ల అమ్మకాలు, కొత్త లాంచ్‌లు తగ్గాయని చెప్పారు. అఫోర్డబుల్ ఇండ్లపై స్టాంప్ డ్యూటీని మహిళలకు 1 శాతానికి, పురుషులకు 3 శాతానికి తగ్గించాలని సూచించారు. ప్రస్తుతం ఇది 5 శాతం–10 శాతం మధ్యలో ఉంది. స్లమ్ రీడెవలప్‌మెంట్‌పై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని నరెడ్కో యాన్యువల్ కన్వెన్షన్‌లో హరిబాబు అన్నారు.
నరెడ్కో, నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, రూ.50 లక్షల లోపు ఇళ్ల ప్రాజెక్ట్ లాంచ్‌లు, -అమ్మకాల నిష్పత్తి 2025లో 0.36కి పడిపోయింది. 2019లో ఇది 1.05 శాతంగా, 2020లో 1.30 శాతంగా నమోదైంది. బెంగళూరు, ఢిల్లీ- ఎన్‌సీఆర్, ముంబై ఎంఎంఆర్, పూణె, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి 8 ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రిపోర్ట్ ప్రకారం, దేశంలో 94 లక్షల ఇండ్ల అవసరం ఉంది. ఇది 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు పెరగొచ్చు. అర్బన్ హౌసింగ్ రంగంలో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదనే విషయం దీనిని బట్టి అర్థమవుతోంది.