ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ సర్వే నంబర్లు గాయబ్

ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ సర్వే నంబర్లు గాయబ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర నీటిపారుదల శాఖ పరిధిలోని భూములకు సంబంధించిన సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో మాయమయ్యాయి. భూసేకరణ పూర్తి కాగానే ఆ భూముల ఖాతాలు, సర్వే నంబర్లను ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్  పేరిట ఎప్పటికప్పుడు మార్పిడి చేయాల్సి ఉన్నప్పటికీ లక్షలాది ఎకరాల భూముల వివరాలు అప్ గ్రేడెషన్  కాలేదు. ఇరిగేషన్  డిపార్ట్ మెంట్ వద్ద ఉన్న  భూముల వివరాలకు  రెవెన్యూ శాఖ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్(ఐఎల్‌‌ఆర్‌‌ఎంఎస్)లోని వివరాలకు పొంతన కుదరడం లేదు.

3,309 గ్రామాల్లో 5.20 లక్షల ఎకరాలు..

సాగునీటి ప్రాజెక్టుల అవసరాల కోసం సేకరించిన భూములు, శిఖం భూములు 3,309 గ్రామాల్లో 5.20 లక్షల ఎకరాలు ఉన్నట్లు ఇరిగేషన్  డిపార్ట్ మెంట్ కు చెందిన ప్రాజెక్ట్ మానిటరింగ్ సాఫ్ట్‌‌వేర్‌‌(ఎస్ పీఎం) డేటా చెబుతోంది. కానీ రెవెన్యూ శాఖ నిర్వహించే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ లో మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్ కింద కేవలం 2,63,167 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపుతోంది. మిగతా 2,49,791 ఎకరాల భూముల వివరాలు ఇంటిగ్రేటెడ్  ల్యాండ్  రికార్డ్సులో నమోదు కాలేదు. వీటిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 51,122 ఎకరాలు, మహబూబాబాద్  జిల్లాలో 30,638 ఎకరాలు, వరంగల్ రూరల్ జిల్లాలో 29,747 ఎకరాలు, నిజామాబాద్  జిల్లాలో 21,392 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 17,486 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. రికార్డులు సరిగ్గా లేకపోతే భవిష్యత్ లో భూముల హద్దుల విషయంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో అధికారులు వాటిని సరిదిద్దే పనిలో పడినట్లు సమాచారం. ఐఎల్‌‌ఆర్‌‌ఎంఎస్  సాఫ్ట్ వేర్ లోని నోషనల్  ఖాతా మాడ్యూల్ ను వినియోగించి ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఇప్పటికే సీసీఎల్ఏ డైరెక్టర్  ఆదేశించినట్లు తెలిసింది.

తెలంగాణ లిక్కర్ ఏపీకి.!