
- లక్ష్మి కెనాల్, సరస్వతీ కాల్వ, గుత్ప ఎత్తిపోతల నుంచి సాగునీరు షురూ
- 6.50 లక్షల ఎకరాలకు అందనున్న తడులు
- ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
బాల్కొండ, నందిపేట, నవీపేట, వెలుగు : రైతు శ్రేయస్సే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ వానాకాలం పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టులు, కాల్వలు, ఎత్తిపోతల నుంచి 6.50 లక్షల ఎకరాలకు నాలుగు తడుల్లో నీటిని అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. వర్షాలు వచ్చి నీటి లభ్యత పెరిగితే మరో మూడు తడులు అందించాలని ఆలోచిస్తోంది.
ఇందులో భాగంగా గురువారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ కు 3000 క్యూసెక్కులు, వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ నుంచి మిడ్ మానేరుకు 3000 క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతీకి 300 క్యూసెక్కులు, గుత్ప అలీసాగర్ కు 180 క్యూసెక్కుల నీటిని వదిలారు. లక్ష్మి కాల్వ కింద 25 వేల ఎకరాలు, వేంపల్లి, నావాబ్ చౌట్పల్లి, హనుమంత్‌రెడ్డి ఎత్తిపోతల కలుపుకుని 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి ఢోకా లేదు.
ఎస్సారెస్పీలో సగం నీరు ఉన్నందున 4 తడులు ఇస్తామని, ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి మరో మూడు తడులు పెంచుతామని ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. సరస్వతీ కెనాల్ కు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నీటి విడుదల చేశారు. నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని అర్గుల్ రాజారాం ‘గుత్ప’ ఎత్తిపోతల పథకం ద్వారా గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి స్విచ్చాన్ చేసి నీటి విడుదల చేశారు.
ఐదు మండలాల పరిధిలోని 38 వేల ఎకరాలకు సాగు నీరు అందనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లిసాగర్ నీటిని కోస్లీ గోదావరి నది వద్ద గల పంపు హౌస్ లో మోటర్ల ద్వారా ఈఈ బలరాం నీటిని విడుదల చేశారు. అల్లిసాగర్ ప్రాజెక్ట్పరిధిలోని 49 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
శ్రీరాంసాగర్ కు 2153 క్యూసెక్కుల వరద
బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 2153క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈ రవి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు,80.50 టీఎంసీలు కాగా,గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1078.30 అడుగులు,40.58టీఎంసీల నీరు ఉంది.కాకతీయ కెనాల్ కు 3వేల క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుండగా దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి షురూ అయిందని జెన్కో ఆఫీసర్లు తెలిపారు.