కృష్ణాలో నీళ్లున్నా పొలం ఎండుతోంది

కృష్ణాలో నీళ్లున్నా పొలం ఎండుతోంది
  • నెట్టెంపాడు కింద చివరి ఆయకట్టుకు అందని సాగునీరు
  • రెండు లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్నరు
  • యాసంగిలో 30 వేల ఎకరాలకే పరిమితం
  • కాల్వలు తెగుతాయని ఒక్కటే మోటార్ రన్​
  • రిపేర్ల కోసం నిధులివ్వని సర్కార్​

గద్వాల, వెలుగు: కృష్ణా నదిలో కావాల్సినన్ని నీళ్లున్నా గద్వాల జిల్లా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని ర్యాలంపాడు కుడి, ఎడమ కాల్వల కింద వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ర్యాలంపాడు ఎడమ కెనాల్​30 కిలో మీటర్లుండగా.. 20 కిలోమీటర్ల వరకు కూడా నీరు రావడంలేదు.  నీళ్లు వస్తాయన్న ఆశతో వరి వేసుకున్న చివరి ఆయకట్టు రైతులు పంటను కాపాడుకోవడానికి  అష్టకష్టాలు పడుతున్నారు.జూరాల బ్యాక్ వాటర్ ఆధారంగా 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​ను చేపట్టారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి గుడ్డందొడ్డి పంప్ హౌస్ కు నీటిని లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి మోటార్ల ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్​కు తరలిస్తారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా  పొలాలకు వదులతారు.  ఈ కెనాల్స్​కు లైనింగ్ పనులు​చేయకపోవడంతో కెపాసిటీకి తగ్గట్టు ఫ్లో పోవట్లేదు. వాస్తవానికి గుడ్డందొడ్డి పంప్​హౌస్​లో ఒక్కోటి 750 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న నాలుగు మోటార్లను ఏర్పాటు చేశారు. కానీ ఏనాడూ 2 మోటర్లకు మించి నడిపించలేదు. దీంతో గత ఖరీఫ్​ సీజన్​లో కూడా నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్​నుంచి  లక్షా 20 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించారు. రెండు మోటార్లు నడిపితేనే కెనాల్స్​ ఎక్కడికక్కడ తెగాయి. ఈసారి కాల్వల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండడంతో కేవలం ఒకే మోటార్​ నడిపిస్తున్నారు. దీంతో రిజర్వాయర్​లో పుష్కలంగా నీళ్లు  ఉన్నా, కృష్ణానదికి వరదలు వచ్చినా నీటిని లిఫ్ట్​ చేసుకోలేక యాసంగిలో కేవలం 30 వేల ఎకరాలకు పరిమితం కావాల్సివచ్చిందని ఆఫీసర్లు చెప్తున్నారు. కాల్వలు తెగిపోతాయన్న భయంతో ఒకే మోటర్​ నడపడం వల్ల పొలాలు ఎండిపోతున్నాయి.

చందాలు వేసుకొని రిపేర్లు

లక్షల పెట్టుబడులు పెట్టి వరి నాట్లు వేసుకున్న రైతులు నీళ్లు రాక పొలాలు ఎండిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు రైతులు ఏకమై  చందాలు వేసుకుని జేసీబీ వెహికల్​ను కిరాయికి తెచ్చుకొని కెనాల్స్​లో ముళ్లపొదలను, సిల్ట్​ను తొలగిస్తున్నారు. అయినా.. చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదని వారు అంటున్నారు. ఈ యాసంగిలో 30 వేల ఎకరాలకు నీరిస్తామని ఆఫీసర్లు చెప్పినా.. 15 వేల ఎకరాలకు కూడా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు మాత్రం ర్యాలంపాడు, గుడ్డందొడ్డి రిజర్వాయర్ల కింద, ఈ ఏరియాలోని చిన్నచితక చెరువుల కింద సాగైన ఆయకట్టును కూడా నెట్టెంపాడు ఖాతాలో వేసి కాకి లెక్కలు చెప్తున్నారు. ఈ యాసంగిలో ఆన్​ అండ్​ ఆఫ్​ పద్ధతిలో నీరందిస్తామని చెప్పినప్పటికీ  డిస్ట్రిబ్యూటరీల దగ్గర  నీటిని విడుదల చేయాల్సిన వాటర్ మెన్లు ( లస్కర్లు) లేకపోవడంతో ఆచరణలో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. కొండాపురం, గువ్వలదిన్నె, నందిన్నె, ఇర్కిచేడు లాంటి గ్రామాల్లో పొలాలు పూర్తిగా ఎండిపోతుండడంతో రైతులు కంటతడిపెట్టుకుంటున్నారు.

కాల్వలు అధ్వానం

నెట్టెంపాడు ఆయకట్టు కెనాల్స్  అధ్వానంగా తయారయ్యాయి. సర్కారు నుంచి కొన్నేండ్లుగా నిధులు రాకపోవడం వల్ల లైనింగ్​ కాదుకదా కనీసం రిపేర్లు కూడా చేయించలేకపోతున్నామని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు. కాల్వల్లో పెరిగిన ముళ్లకంపలు, సిల్ట్​ను కూడా తీయడంలేదు. గతంలో కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడ  కాల్వలు కోతకు గురయ్యాయి. దీంతో నీరు చివరిదాకా పారడంలేదు.  నెట్టెంపాడు స్కీమ్​లో మెయిన్ కెనాల్స్​, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నా.. ఇప్పటికీ సబ్​ కెనాల్స్​ తవ్వలేదు. దీంతో పక్కనే కృష్ణా నది ఉన్నా తమ పొలాలు బీళ్లుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫండ్స్​ లేకే రిపేర్లు చేయట్లే

చివరి ఆయకట్టుకు నీరు అందని మాట వాస్తవమే. నీటి విడుదలలో ఇబ్బందులు ఉన్నాయి. ఫండ్స్ లేక రిపేర్లు చేయించడం లేదు. కొన్నిచోట్ల రైతులే రిపేర్లు చేసుకుంటున్నా రు. వరి పంట వేసుకోవద్దని సూచించినా కొన్ని చోట్ల రైతులు వినలేదు. ఆరుతడి పంటలు వేసుకుని ఉంటే నీళ్ల సమస్య వచ్చేదికాదు.

– వెంకటేశ్వర్​రావు , నెట్టెంపాడు కెనాల్