
- సుప్రీంకోర్టు తీర్పునూ స్టడీ చేస్తం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉన్న పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందని కమిటీ చైర్మన్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను స్టడీ చేస్తుందని వెల్లడించారు.
ఈ అంశంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై సోమవారం కేబినెట్ సబ్ కమిటీ జలసౌధలో సమావేశమైంది. కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో కో చైర్మన్ , హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ టీకే శ్రీదేవి, పీఆర్సీ చైర్మన్ శివశంకర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
వర్గీకరణ అమలు చేసే సమయంలో లీగల్ ఇబ్బందులు రాకుండా న్యాయనిపుణులతో చర్చిస్తామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.