హరీశ్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: ఉత్తమ్ కుమార్

హరీశ్ చెప్పేవన్నీ  పచ్చి అబద్ధాలు: ఉత్తమ్ కుమార్
  • కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన్రు
  • తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటా 299కు ఎవరి వల్ల తగ్గింది?
  • రాయలసీమ లిఫ్ట్​ టెండర్లు పూర్తయ్యేదాకా అపెక్స్​ భేటీకి కేసీఆర్​ ఎందుకు పోలే
  • బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టీకరణ

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్​రావు పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి నీటి వాటాల్లో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులను అప్పగించలేదని, బీఆర్ఎస్ ​మాత్రం తమపై విష ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ను కలిసినప్పుడు కూడా ప్రాజెక్టులను అప్పగించేది లేదని ఖరాకండిగా చెప్పామని తెలిపారు. సోమవారం సాయంత్రం సెక్రటేరియెట్​లో మీడియాతో ఉత్తమ్​ మాట్లాడారు. కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​ బోర్డుకు ప్రాజెక్టులు ఇవ్వడానికి 56 రోజుల తమ పాలనలో ఎప్పుడూ ఒప్పుకోలేదన్నారు. ‘‘తెలంగాణకు నీటి కేటాయింపుల్లో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించిది కూడా ఆ పార్టీనే” అని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 60 ఏండ్లు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కన్నా పదేండ్ల కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. 

‘‘కేసీఆర్​అసమర్థతతోనే కృష్ణా నీళ్లలో తెలంగాణ ప్రజలకు, రైతులకు తీరని అన్యాయం జరిగింది. సహజ న్యాయసూత్రాలు, పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావ ప్రాంతం ఇలా ఏ ప్రాతిపదిక తీసుకున్న ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు వాటాగా 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉండె. అందుకు విరుద్ధంగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేలా 2015లో చేసుకున్న ఒప్పందంపై అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసింది. దీంతో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది” అని ఉత్తమ్  వివరించారు. 

బోర్డుకు నిధులు ఇస్తామని బడ్జెట్​లోనే చెప్పిన్రు కదా?

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు.  కేసీఆర్​ఇరిగేషన్​శాఖ మంత్రిగా 2023 –24 బడ్జెట్​ప్రతిపాదనల్లోనే కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జునసాగర్​ప్రాజెక్టులు అప్పగిస్తున్నట్లు ప్రతిపాదిస్తూ.. బోర్డు నిర్వహణకు వన్​టైం సీడ్​మనీ కింద రూ.200 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు.  కేఆర్ఎంబీకి నిధులు ఇస్తామని బడ్జెట్ డిమాండ్​లోనే ప్రతిపాదించారంటే ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లను ప్రభావితం చేయడానికి కేసీఆర్ ఏపీ సీఎం జగన్​తో కుమ్మక్కై ఎన్నికలకు కొన్ని గంటల ముందే ఏపీ పోలీసులను నాగార్జునసాగర్​డ్యామ్​పైకి పంపారని, అది రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ ఆడిన నాటకమేనని మండిపడ్డారు. ‘‘కేసీఆర్, జగన్​ప్రగతి భవన్​లో ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతలకు బీజం పడింది. తెలంగాణకు కృష్ణా నది నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే 8 టీఎంసీలను రాయలసీమకు మళ్లించేలా ఇద్దరు కలిసి కుట్ర చేసిన్రు. 

2020 జనవరిలో కేసీఆర్, జగన్​ సమావేశమైతే అదే ఏడాది మే నెలలో శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించే రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది.  కేంద్రం అపెక్స్​కౌన్సిల్​సమావేశానికి పిలిచినా ఆ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా వెళ్లకుండా జగన్​కు కేసీఆర్​సహకరించిండు. దీంతో ఏపీ ప్రభుత్వం పనులు చేసుకుంటూ పోయింది” అని ఆయన తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటా దక్కకుండా చేసిందే కేసీఆర్​ప్రభుత్వమని మండిపడ్డారు.  

కేసీఆర్​ సర్కార్​ అవినీతితోనే మేడిగడ్డ కుంగింది

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నాటి బీఆర్​ఎస్​ సర్కార్​ నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్​ అన్నారు. ‘‘మూడేండ్లకే  మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయే పరిస్థితి తలెత్తింది. దీనికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతే కారణం. నిజాలేంటో తేల్చడానికి విజిలెన్స్​తో విచారణ చేయిస్తున్నం” అని చెప్పారు. ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాకు నీళ్లు ఇచ్చే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్​ప్రాజెక్టును పదేండ్లు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, హరీశ్ రావు యువతను, ప్రజలను రెచ్చగొట్టారు.. బ్లాక్​మెయిల్​ చేశారు. హరీశ్​రావు పెట్రోల్​ పోసుకున్నట్లు నమ్మించి.. వేరే వాళ్ల మరణాలకు కారణం అయ్యిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత కేసీఆర్​ది, బీఆర్ఎస్​ది ఎంతమాత్రం కాదు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు సహా ప్రతిపక్షపార్టీల మద్దతును కాంగ్రెస్​ కూడగట్టడంతోనే తెలంగాణ వచ్చింది” అని అన్నారు. కేసీఆర్​పాలనలో అస్తవ్యస్థమైన ఇరిగేషన్​ వ్యవస్థను చక్కదిద్దుతున్నామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. కృష్ణా బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులు అప్పగించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​రెడ్డి పాల్గొన్నారు.