- ఆ ఖర్చు వర్క్ ఏజెన్సీనే భరిస్తది: ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్
- సెప్టెంబర్ నాటికి పంపులు సిద్ధం చేస్తం
- వరదలపై అప్రమత్తంగానే ఉన్నం
- వాతావరణంలో అనూహ్య మార్పులతో జరిగేది క్లౌడ్ బరస్ట్
- పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం, పర్ణశాల మునుగుతయ్
హైదరాబాద్, వెలుగు : వరదలతో మునిగిన కాళేశ్వరం పంపుల రిపేర్లకు రూ. మూడు నాలుగు వందల కోట్లు ఖర్చవుతుందనే దానిలో వాస్తవం లేదని, రూ. 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకే ఖర్చవుతుందని ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ అన్నారు. ఆ నష్టాన్ని కూడా ఆయా పంపుహౌస్ ల నిర్వహణ చూస్తున్న వర్క్ ఏజెన్సీనే భరిస్తుందని చెప్పారు. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలానికి పోటెత్తిన భారీ వరదలు, దాంతో వాటిల్లిన నష్టంపై బుధవారం జలసౌధలో ఆయన ఈఎన్సీలు, ఇంజనీర్లతో సమీక్షించారు. అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో భాగమైన పంపుహౌస్ లు, బ్యారేజీల నిర్వహణ అగ్రిమెంట్ ప్రకారం ఆయా వర్క్ ఏజెన్సీలే చూసుకోవాల్సి ఉంటుందన్నారు. 45 రోజుల్లోనే పంపుహౌస్ లను పునరుద్ధరించి, సెప్టెంబర్ నాటికి పంపులు సిద్ధం చేస్తామని చెప్పారు.
వరదలపై ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదని, ఎల్లప్పుడూ అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు. వరద నష్టంపై మీడియాలో వస్తున్న కథనాలన్నీ నిరాధారమైనవేనన్నారు. వరదలు, వర్షాలపై ప్రభుత్వం సంసిద్ధంగా లేదని కొందరు చేస్తున్న విమర్శలు సరికావని ఆయన పేర్కొన్నారు. సీడబ్ల్యూసీలోని 18 డైరెక్టరేట్ల నుంచి పర్మిషన్లు తీసుకున్న తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. ‘‘వరదలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తో పాటు, యురోపియన్ శాటిలైట్ ఏజెన్సీల నుంచి కూడా ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎంత తీవ్రత ఉంటుందనే దానిపై సరైన సమాచారం అందలేదు. వరదల తీవ్రతపై అవికూడా కచ్చితమైన అంచనా వేయలేకపోయాయి. దీంతోనే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది” అని రజత్ కుమార్ పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టుకు ఎగువన ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లోనే 300 మి.మీ.ల వర్షం కురిసిందని, దీంతో ఆ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిందన్నారు. ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విభాగం ఆధ్వర్యంలో కడెం ప్రాజెక్టుకు రిపేర్లు చేయడంతోనే ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. గత వందేండ్లలో కడెం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో ఇంతటి భారీ వర్షం కురవలేదన్నారు.
క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ టెర్మినాలజీ కాదు
క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ టెర్మినాలజీ కాదని, వాతావరణంలో అనూహ్యంగా చోటు చేసుకునే మార్పులతోనే ఒకేసారి భారీ ఎత్తున వర్షం కురుస్తుందని రజత్ కుమార్ స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ పై స్టడీ చేయాలని తాము సీడబ్ల్యూసీ సహా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఇది వరకే కోరామన్నారు. ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో తెలంగాణలో లక్ష ఎకరాలు ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం, పర్ణశాల మునిగిపోతాయన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి పలుమార్లు నివేదించినా స్పందన లేదని ఆరోపించారు. సమావేశంలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఇంజనీర్లు పాల్గొన్నారు.
