- పొట్టదశలో ఎండుతున్న పంటలు.. అన్నదాతల ఆందోళన
- నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని రైతుల డిమాండ్
- కడెం ప్రాజెక్టులో 2.062 టీఎంసీలు మాత్రమే నిల్వ
- తాగునీటి అవసరాలకే వాడుకోవాలని సర్కారు ఆదేశాలు
మంచిర్యాల, వెలుగు: ఎల్‌నినో ఎఫెక్ట్ తో సాగునీటి ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. నిల్వ నీటిని తాగునీటి అవసరాలకే వాడుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు సాగునీటి విడుదల నిలిపేశారు. దీంతో చివరి దశలో ఉన్న వరి పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. ఈ నెలాఖరు వరకు సాగునీరు విడుదల చేస్తే పంటలు చేతికొస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల రైతులు కొద్ది రోజులుగా సాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు పెట్టుబడి పెట్టామని, మరో తడికి నీరందక పోతే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
68 వేల ఎకరాల్లో సాగు..
కడెం ప్రాజెక్టు కింద నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సుమారు 68 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో కడెం కింద 38 వేల ఎకరాలు, గూడెం లిఫ్ట్ కింద 30 వేల ఎకరాలు ఉన్నాయి. వానాకాలం ప్రారంభంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి డీ-28– డీ-41 వరకు, గూడెం లిఫ్ట్ ద్వారా డీ-42 వరకు సాగునీరు అందించారు. ఈ నెల 9 నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటలు చేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాలని దండేపల్లి, జన్నారం మండలాల్లో రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాలతో కడెం ప్రాజెక్టు నుంచి అదనంగా 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, అది సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. మంగళవారం జన్నారం మండలం చింతగూడతో పాటు పలు గ్రామాల రైతులు కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని నీటిని విడుదల చేయాలని ఆఫీసర్లను కోరారు.
అడుగంటిన ‘కడెం’..
కడెం ప్రాజెక్టు కెపాసిటీ 7.5 టీఎంసీలకు దాదాపు 4 టీఎంసీలు పూడిక పేరుకుపోయింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలకు పడిపోయింది. ఈ ఏడాది కడెం ప్రాజెక్టుకు మొత్తం 16.320 టీఎంసీల వరద వచ్చింది. కెనాల్స్ ద్వారా 4.373 టీఎంసీలు రిలీజ్ చేయగా, 8.866 టీఎంసీల వరద గోదావరిలోకి వెళ్లింది. ప్రస్తుతం 2.062 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉన్నది.
ఇందులో నుంచి 700 క్యూసెక్కులు పంటల కోసం రిలీజ్ చేశారు. గూడెం లిఫ్ట్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలు కేటాయించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 17 టీఎంసీలు ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సాగునీటి విడుదల నిలివేశారు. అలాగే ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కెనాల్ కింద 35 వేల ఎకరాలు సాగువుతుండగా, నీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
