
- రెండు పంటల తర్వాత సాగునీటికి మోక్షం
- ప్రస్తుతానికి 30 వేల ఎకరాలకు పారకం
సంగారెడ్డి/పుల్కల్, వెలుగు: ఎట్టకేలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్మండలంలోని సింగూరు ప్రాజెక్ట్నుంచి అధికారులు సాగునీటిని విడుదల చేశారు. కాల్వల మరమ్మతు కారణంగా రెండు దఫాలుగా వ్యవసాయానికి చుక్కనీరు ఇవ్వలేకపోయారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ కారణంగా వ్యవసాయానికి సింగూరు నీళ్లు వదలాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 18.464 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
గురువారం మంత్రి దామోదర దాదాపు 30 వేల ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేశారు. రైతుల పక్షాన ప్రభుత్వం స్పందించడంతో రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సింగూర్ ఎడమ కెనాల్స్ లింక్ చెరువుల ద్వారా ఆందోల్, చౌటకూర్, పుల్కల్, మునిపల్లి మండలాల వారీగా నీరు అందించనున్నారు. ఎడమ కాల్వల ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా30వేల ఎకరాల సాగుకు సరిపోతుందని అంచనా వేశారు. మిగిలిన 20 వేల ఎకరాలకు అవసరాన్ని బట్టి వర్షాలు కురిసి ప్రాజెక్టులో నీటి నిల్వ పెరిగితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.
రెండు పంటలకు చుక్కెదురు
సింగూరు ప్రాజెక్టు ద్వారా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 50 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నారు. కానీ గడిచిన రెండు పంటలకు సాగు నీటిని ఇవ్వలేకపోయారు. మొదట్లో ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో సాగునీరు విడుదల చేయలేదు. మొన్నటి వరకు కాల్వల రిపేర్ పనుల కారణంగా నీరు విడుదల చేయలేదు. ఈ క్రమంలో రెండు సీజన్లకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. రైతులు ఎక్కువ శాతం సింగూరు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తుండడంతో కనీసం ఈ ఖరీఫ్ కైనా నీళ్లు ఇవ్వాలని కోరారు. దీంతో సింగూరు కాల్వల సీసీ లైనింగ్ పనులకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి సాగునీటిని అందించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లాలో 50 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో సింగూర్ నీటి వినియోగం కొనసాగుతూ వచ్చింది. ఘనపురం ఆనకట్టకు నీటిని విడుదల చేస్తే అక్కడి నుంచి ఆ 30 వేల ఎకరాలకు నీరందుతుంది. కానీ సింగూరు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి సంగారెడ్డి జిల్లాలో 30 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసి ఆ తర్వాత మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టకు నీరందించాలని ఇరిగేషన్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
స్టూడెంట్స్ లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలి
పుల్కల్: స్టూడెంట్స్ లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. గురువారం సింగూర్ కెనాల్ ద్వారా పంటల సాగు కోసం నీటిని విడుదల చేసిన అనంతరం రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ స్కూళ్లను కూతురు త్రిషతో కలిసి తనిఖీ చేశారు. స్టూడెంట్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీవో పాండుకు సూచించారు. ప్రతి స్కూల్ లో స్పోర్ట్స్ మెటీరియల్ ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో అనందమేరి, ఎంఈవో శంకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దుర్గారెడ్డి, ఉపాధ్యక్షుడు అంజయ్య, డీసీసీబీ డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, గోవర్థన్,
రామలింగం పాల్గొన్నారు.