బీజేపీ మళ్లీ గెలిస్తే స్వేచ్ఛ ఉండదు: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌

బీజేపీ మళ్లీ గెలిస్తే స్వేచ్ఛ ఉండదు: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌

మేళ్లచెరువు, వెలుగు: కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ ఉండదని ఇరిగేషన్ మినిస్టర్‌‌‌‌మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 21న హుజూర్‌‌నగర్‌‌లో నిర్వహించనున్న నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశం నేపథ్యంలో చింతలపాలెం, మేళ్లచెరువులో ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గత పదేండ్లలో వ్యవస్థలన్నింటినీ మోదీ తన గుప్పిట్లో ఉంచుకుని దేశంలో నిరంకుశ పాలన సాగించారని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటిదర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌తో పాటు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో మంత్రులను జైళ్లకు పంపారన్నారు. ఇండియా కూటమి గెలుస్తుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్లను ఫ్రీజ్ చేయించారని మండిపడ్డారు. 

వారు మాత్రం ఎలక్టోరల్ బాండ్ల పేరుతో కూడబెట్టుకున్నారని ఆరోపించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. దేశంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు అల్లాడిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేండ్లలో రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయిందని, మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి.. దానికి చట్టబద్ధత కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని దుయ్యబట్టారు. తెలంగాణ విభజన సమయంలోనూ మోదీ హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. విభజన సమయంలో ఏపీలోని పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు ఇచ్చి, తెలంగాణలో ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ లోపాయికారిగా బీజేపీకి సహకరించడం వల్లే తెలంగాణకు నీటి విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. 

బీఆర్‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లు కూడా రావు.. 

మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలో చేరనున్నారని ఉత్తమ్ తెలిపారు. ఇప్పటికే చాలా మంది అసంతృప్తులు ఆ పార్టీ వీడారన్నారు. టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను జాతీయ పార్టీగా మార్చబోయి బొక్కబోర్లా పడ్డారన్నారు. కేసీఆర్ అహంకారంతో పాలన చేసి దోపిడీ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ సీట్లు గెలబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. 15 చోట్ల బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.