కబేళాల్లోనే కోళ్లను కోయాలి.. చికెన్ షాపుల్లో కాదు : గుజరాత్ కోర్టు

కబేళాల్లోనే కోళ్లను కోయాలి.. చికెన్ షాపుల్లో కాదు : గుజరాత్ కోర్టు

కోళ్లను పౌల్ట్రీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్ షాపుల్లో పౌల్ట్రీ పక్షులను వధించడాన్ని వ్యతిరేకిస్తూ యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్, అహింసా ఫెడరేషన్‌ల పిటిషన్ దాఖలు చేశాయి. ఈ అంశంపై మార్చి 30న గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలను ఉల్లంఘించి, పరిశుభ్రత ప్రమాణాలు పాటించనందున మాంసం, పౌల్ట్రీ షాపులను మూసివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు చర్యలు చేపట్టి పెద్ద సంఖ్యలో మాంసం దుకాణాలను మూసివేశాయి.

కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పౌల్ట్రీ వ్యాపారులు, చికెన్ షాపు యజమానులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణలో కోడి పక్షినా లేక జంతువునా అనే ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాతే కొత్త వివాదం రాజుకుంది. కబేళాల్లో పక్షులను వధించాలని పిటిషనర్లు కోరగా, కోళ్ల వ్యాపారులు, చికెన్ షాపు యజమానులు డిమాండ్ ఆచరణాత్మకం కాదని వాదించారు. కబేళాలు జంతువులను వధించడానికే అని వారు వాదిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, పౌల్ట్రీ తరగతికి చెందిన పక్షులను జంతువుల వర్గంలోకి తీసుకురావాలని కూడా వాదించారు. కోర్టు తీర్పు తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.