దళితబంధు టీఆర్ఎస్ కార్యకర్తలకేనా?: షర్మిల

దళితబంధు టీఆర్ఎస్ కార్యకర్తలకేనా?: షర్మిల

నర్సాపూర్ (జి), వెలుగు: దళితబంధు పథకాన్ని అర్హులైన నిరుపేదలకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తప్పుపట్టారు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా పోడు భూముల పట్టాలు ఇవ్వలేదన్నారు. పంట నష్టపోతే రైతులకు కనీసం పరిహారం కూడా అందే పరిస్థితి లేదన్నారు. ఆదివారం ఉదయం నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని కల్లూరు మీదుగా ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించారు.

పాదయాత్ర నర్సాపూర్ జి మండల పరిధిలోని అర్లి క్రాస్ రోడ్స్, చాక్ పెల్లి, నర్సాపూర్ గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇలాకాలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సాయంత్రం 5 గంటలకు రాంపూర్ గ్రామ ప్రజలతో షర్మిల మాటముచ్చట నిర్వహించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్టీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.