Dhanush Political Entry: 234 నియోజకవర్గాల్లో ఫ్రీ ట్యూషన్ సెంటర్లు.. విజయ్ బాటలోనే ధనుష్ పొలిటికల్ ఎంట్రీ?

Dhanush Political Entry: 234 నియోజకవర్గాల్లో ఫ్రీ ట్యూషన్ సెంటర్లు.. విజయ్ బాటలోనే ధనుష్ పొలిటికల్ ఎంట్రీ?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చుట్టూ ఇప్పుడు సినిమాల కంటే ఆయన రాజకీయ ఎంట్రీపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ఈ హీరో తన రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ  అభిమానుల కోసం తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు,  ఫ్యాన్స్ క్లబ్ లో కీలక మార్పులు, విద్యార్థుల కోసం భారీగా సంక్షేమ ప్రణాళికలు చూస్తుంటే త్వరలోనే ధనుష్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టబోతున్నారన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.  అటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ధనుష్ కు చెందిన నర్పణి ఇయక్కం తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉచిత ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యా్ర్థులకు అకడమిక్ సపోర్ట్ అందించనున్నారు. ప్రతి కేంద్రంలో ముగ్గురు టీచర్లు, ఒక అసిస్టెంట్ ను నియమించి.. వారి జీతాలను కూడా తమ సంస్థే భరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత జిల్లా కేంద్రాల్లో ప్రారంభించి, ఆతర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్న యోచనలో ధనుష్ ఉన్నట్లు తెలుస్తోంది. 

జనవరి నుంచి ఈ అకడమిక్ సపోర్ట్ కేంద్రాలు ఏర్పాట్లు మొదలయ్యే అవకాశముంది. ఈ ప్రణాళిక తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి, విద్యా సంక్షేమ కార్యక్రమాలతో యువతకు చేరువైన విజయ్ ప్రయాణంతో ధనుష్ చర్యలను పలువురు పోలుస్తున్నారు.  ఇటీవల తిరువళ్లూరు జిల్లాలోని మంజంగరణైలో తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు సాయం, ఉచిత ఆటోరిక్షాల పంపిణీ, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం కూడా చర్చనీయాంశమైంది. అక్టోబర్ 14న కోయంబత్తూరులో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఫ్యాన్ క్లబ్‌ను 'ధనుష్ నర్పణి ఇయక్కం'గా మార్చినట్లు తెలుస్తోంది. జెండా, చిహ్నాన్ని కూడా ఆవిష్కరించినట్లు జోరుగా చర్చకూడా నడుస్తోంది.

అంతే కాదు లేటెస్ట్ గా చెన్నైలో 2,000 మందికి పైగా మహిళా నిర్వాహకులతో ధనుష్ సమావేశమవడం, వారికి వెండి కామాక్షి దీపాలు అందించడం ఆసక్తిని మరింత పెంచింది. 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి యువత, తొలిసారి ఓటు వేయబోయే వారితో అనుబంధం పెంచుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు ధనుష్ సినీ ప్రయాణం కూడా జోరుగా సాగుతోంది. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్న ' ఓం ' ( OM – Chapter 1) నవంబర్ 20, 2026న విడుదల కానుంది. మదురైలో తమిజరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో 'D56' చిత్రీకరణ కూడా కొనసాగుతోంది. మరి ఈ సేవా కార్యక్రమాలు సామాజిక బాధ్యతకే పరిమితమవుతాయా? లేక భవిష్యత్తులో రాజకీయాలకు పునాది అవుతాయా? అన్నది వేచి చూడాలి..