గాంధీ పేరు తగిలించుకుంటే వారసులైపోతరా? : లక్ష్మణ్

గాంధీ పేరు తగిలించుకుంటే వారసులైపోతరా? : లక్ష్మణ్

కాంగ్రెస్ నేతలపై బీజేపీ స్టేట్​చీఫ్​ లక్ష్మణ్​ ఫైర్
రాష్ట్ర కార్యాలయంలో మహాత్ముడికి నివాళి

హైదరాబాద్, వెలుగు: గాంధీ పేరును తగిలించుకున్నంత మాత్రాన కాంగ్రెస్ నేతలు ఎన్నటికీ ఆయన వారసులు కాలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోడీ మాత్రం గాంధీ కన్న కలలను సాకారం చేస్తున్నారని కొనియాడారు. దేశాన్ని  అభివృద్ధి మంత్రంతో ఒక్కతాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి లక్ష్మణ్ తో పాటు పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2 నుంచి జనవరి 30 వరకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారని అన్నారు. ప్లాస్టిక్ వల్ల వాతావరణం విషపూరితం అవుతుందని, దీంతో భయంకరమైన వ్యాధులు వస్తున్నాయన్నారు. విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్​లో పారిశుధ్యంలోపించి విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. ఈ నెల 22 నుంచి నవంబర్ 10 వరకు తెలంగాణ వ్యాప్తంగా సంకల్ప యాత్ర చేయనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు.