కరోనా పెరుగుతుంటే వేడుకలూ.. మీటింగ్​లా?

కరోనా పెరుగుతుంటే వేడుకలూ.. మీటింగ్​లా?

కరోనా వైరస్ ధాటికి మన దేశ హెల్త్ సిస్టమ్ దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు మనం ఒక రకంగా నేషనల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం. కరోనా ఫస్ట్‌‌ వేవ్‌‌కి, సెకండ్ వేవ్‌‌కి చాలా తేడా ఉంది. గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అంతా చాలా అలర్ట్‌‌గా ఉండి వైరస్‌‌ స్ప్రెడ్‌‌ను అడ్డుకోవడానికి కృషి చేశాం. కానీ ఈ సారి పరిస్థితి చేయి దాటిపోతున్న విషయం కనిపిస్తున్నా.. నేటికీ ఎలక్షన్ ప్రచార సభలు, మతపరమైన సమ్మేళనాలు, రైతుల నిరసనలు వేటికవి సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బెడ్ల కొరత, ఆక్సిజన్ కరువు, ఆఖరికి శ్మశానాల్లో కూడా చోటు లేకుండా పోతోంది. ఇంకా పార్టీలు, జనాల్లో మార్పు రాకుంటే ‘డాక్టర్లు దేవుళ్లు, వాళ్ల త్యాగాలకు సలాం’ లాంటి మాటలకు పైపైకి చెబుతూ వాళ్ల సేవలను అవమానించడమే.

కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తుండటంతో ఇప్పుటికే మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ స్టేజ్‌‌కి రావడానికి పెద్ద  టైమ్‌‌ పట్టదు... ఈ మాటలు ముంబైలోని లీలావతి హాస్పిటల్ టాప్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జలీల్ పార్కర్ నిక్కచ్చిగా చెప్పినవి. ఏడాదిగా కరోనా మహమ్మారి వార్తల రిపోర్టింగ్‌‌లోనే ఉన్న నాకు ఆయన మాటలు విన్న తర్వాత కొద్దిసేపు నోట మాటరాలేదు. గ్రౌండ్‌‌ లెవెల్‌‌లో వాస్తవ పరిస్థితి చూస్తుండడంతో సీరియస్‌‌నెస్‌‌ అర్థమైంది. పార్కర్ అన్న మాటలు పూర్తిగా నిజం. పైగా కరోనా క్రైసిస్ కారణంగా మన దేశ హెల్త్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. కానీ ఇంకా ఇండియా జీడీపీలో కనీసం రెండు శాతం కూడా పబ్లిక్ హెల్త్ సెక్టార్ మీద ఖర్చు చేయడం లేదంటే, పాలసీ ఫ్రేమ్‌‌వర్క్‌‌లో ఏ స్థాయిలో మార్పులు జరగాలో ఒక్కసారి ఆలోచించాలి.

గ్రౌండ్‌‌ లెవెల్‌‌లో పరిస్థితి ఘోరంగా ఉంది
కరోనా టెస్టింగ్ సెంటర్లలో స్టాఫ్ మొదలు, గంటలు గంటలు క్యూలో నిల్చున్న జనం వరకు, కరోనా ఐసీయూ వార్డుల్లో పని చేసే డాక్టర్ల నుంచి నర్సుల వరకు, అంబులెన్స్ డ్రైవర్ల నుంచి హాస్పిటళ్లు, శ్మశానాల దగ్గర రోదిస్తున్న కరోనా బాధితుల బంధువుల వరకు... అందరితో మాట్లాడిన అనుభవంతో, గ్రౌండ్‌‌ లెవెల్‌‌లో పరిస్థితి పైకి కనిపిస్తున్న దానికంటే ఘోరంగా ఉందని అథెంటిక్‌‌గా చెప్పగలను. ఏదో ఒక్కటి కాదు.. మందులు, బెడ్లు, ఆక్సిజన్ ఇలా కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో అవసరమైన ప్రతి వస్తువు షార్టేజ్‌‌ చాలా ఎక్కువగా ఉంది.

ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నయ్
అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక చాలా మంది కరోనాకు బలైపోతున్నారు. ముంబైకి సమీపంలో ఉండే వాసయ్ పాల్‌‌గఢ్ ప్రాంతంలోని వినాయక ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఒకే రోజు ఎనిమిది మంది ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయారు. మృతుల్లో ఒకడైన రాంబాబు అనే టైలర్‌‌‌‌ కుటుంబాన్ని నేను కలిశాను. ఒకే రూమ్ ఉండే చిన్న ఇంట్లో అతడి భార్య, కొడుకు, కూతురిని చూసి నా మనసు చలించిపోయింది. కుట్టు మిషన్‌‌ను ఒక బల్ల మీద పెట్టి, వాళ్లంతా దాని వైపు దీనంగా చూస్తూ నేలపై కూర్చుని ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచిస్తే ఒక్క క్షణం శరీరమంతా బండరాయిలా మారిపోయినట్టు అనిపించింది. ఆక్సిజన్ షార్టేజ్‌‌ వల్ల ఇలా చాలా కుటుంబాలు పెను విషాదంలో మునిగిపోతున్నాయి. జీవితాలు అంధకారంగా మారి, మరింత పేదరికంలోకి జారిపోతున్న కుటుంబాలను ఎన్నో చూశాను. మహారాష్ట్ర, బీహార్, మధ్య ప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితిని కళ్లారా చూశాను. మహారాష్ట్ర అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారమే 50 శాతం మరణాలు ఆక్సిజన్ కొరత వల్లే.

బయట ట్రై చేసుకోమంటున్నరు
కొన్ని చోట్ల ఆస్పత్రులు ఆక్సిజన్, కొన్ని ఎమర్జెన్సీ మందుల సాక్ట్ లేక చేతులెత్తేశాయి. పేషెంట్ల బంధువులనే బయట ట్రై చేయాలని చెబుతున్నారు. పాట్నాలో ఒక హాస్పిటల్‌‌ నుంచి మనీషా అనే ఆమె నాకు ఫోన్ చేసింది. ‘53 ఏండ్ల వయసున్న నా తండ్రి పరిస్థితి క్రిటికల్‌‌గా ఉంది. ఆయనకు ఆక్సిజన్‌‌ అందించాలని డాక్టర్లు చెప్పారు. కానీ హాస్పిటల్‌‌లో అందుబాటులో లేదని, బయట ఎక్కడైనా ట్రై చేయాలని నాకే చెప్పారు’ అని ఏడుస్తూ, ఏదైనా సాయం చేయాలని నన్ను కోరింది. ‘మా హాస్పిటల్‌‌లో రెమ్డెసివిర్ సహా మరికొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ స్టాక్ కొరత ఉంది. కొన్ని సార్లు ఏం చేయలేని స్థితిలో పేషెంట్ల బంధువులను నేరుగా ఫార్మా డీలర్లు లేదా ఇతర మార్గాల్లో ప్రయత్నించాలని చెబుతున్నాం’ అని ముంబై ఎస్‌‌ఆర్వీ హాస్పిటల్‌‌ డాక్టర్ చెప్పారు.

రైల్వే, ఆర్మీ సాయం తీసుకోవాలె
దేశంలోని తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి దేశంలోని మిగతా ప్రాంతాలకు ఆక్సిజన్ వేగంగా తరలిస్తే కొంత మేర పరిస్థితి మెరుగుపడుతుంది. దేశంలో ఉన్న స్టీల్ పరిశ్రమలతో పాటు ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రభుత్వం సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రైల్వే ఒక్కటే కాకుండా ఆర్మీ సాయం తీసుకోవాలి.

రెండో వేవ్‌‌లో యూత్, చిన్న పిల్లలపైనా ఎఫెక్ట్
గత ఏడాది వచ్చిన ఫస్ట్ వేవ్‌‌ కంటే ఇప్పటి రెండో వేవ్‌‌ కరోనా చాలా భయపెడుతోంది. 2020లో మనం ఎదుర్కోని ఒక మేజర్ సమస్య ఇప్పుడు వస్తున్నది. సెకండ్‌‌ వేవ్‌‌లో యువత సహా మూడు నాలుగేండ్ల వయసున్న చిన్న పిల్లలకూ కరోనా వస్తోంది. మనం ఫేస్ చేస్తున్న డబుల్ మ్యుటేషన్లను బట్టి ఇప్పుడు దేశం ఫైట్ చేస్తోంది ఒక్క కరోనా వైరస్‌‌తో కాదు.. అనేక వైరస్‌‌లతో అని గుర్తించాలి. ఇప్పుడు అనేక మహమ్మారులతో ఒకేసారి పోరాడుతున్నట్టే.

డెడ్‌‌బాడీలకూ తప్పని వెయిటింగ్
టెస్టు కిట్లు, బెడ్లు, మందులు, ఆక్సిజన్ కొరత ఒక ఎత్తు. ఆఖరికి ప్రాణం పోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి కూడా శవాలను క్యూలో పెట్టుకుని వెయిట్ చేయాల్సిన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. గోత్కోపర్‌‌‌‌లో తన భార్య అంత్యక్రియలు చేయడం కోసం శ్మశానం దగ్గర గంటలు గంటలు వీల్‌‌ ఛైర్‌‌‌‌లో కూర్చుని 95 ఏండ్ల ముసలాయన ఎదురుచూస్తున్న ఘటనను నేను చూశాను. ‘మొదట్లో ఆస్పత్రుల్లో చోటు లేదన్నారు.. ఇప్పుడు శ్మశానాల్లోనూ చోటు లేదని అంటున్నారు. మేం ఎక్కడికిపోవాలి’ అని ఓ యువకుడు అక్కడ ఆవేదనతో కేకలు వేయడం చూసి నా హృదయం 
చలించిపోయింది. 

నాయకుల తీరు మారాలె
కరోనా కోరల్లో చిక్కి మన హెల్త్ సిస్టమ్ నలిగిపోతోంది. మన దేశం హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది. కానీ గత ఏడాది ఉన్న అలర్ట్‌‌నెస్ ఇంకా కనిపించడం లేదు. రాజకీయ పార్టీల ఎలక్షన్ ర్యాలీలు, ఆధ్యాత్మిక, మత సమ్మేళనాలు ఇంకా ఆగలేదు. రైతుల నిరసనలు, ఇతర మాస్ గ్యాదరింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకంటే ఫ్రంట్ లైన్ వర్కర్లు, డాక్టర్లకు మనం చేసే అవమానం వేరే ఏం ఉండదని నా అభిప్రాయం. క్షణం తీరిక లేకుండా మనకు సేవ చేసి వాళ్లు తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల మంది డాక్టర్లు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఫ్రంట్‌‌ లైన్ వారియర్లూ అని పిలుస్తూ గొప్పగా గౌరవిస్తామని చెప్పే మన పొలిటికల్ లీడర్లు ‘జనాలకేమో లాక్‌‌డౌన్లు.. నేతలకేమో ప్రచారాలు’ అన్నట్లు వ్యవహరించడం డాక్టర్ల పట్ల అతి పెద్ద క్రైమ్‌‌కు పాల్పడడంతో సమానం.

ఇప్పుడు బెడ్లు, మందులే.. రేపు డాక్టర్ల కొరత వస్తే..?
దేశంలో ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం నాటి కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని డాక్టర్ జలీల్ పార్కర్ లాంటి వాళ్లు అంటున్నారు. ‘ఇంకా కొన్ని చోట్ల మాస్కులు పెట్టుకోమని చెప్పడం పాపం అన్నట్టుగా దాడులు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల బెడ్ల కొరత లేదా మరేదైనా ఇబ్బంది వల్ల పేషెంట్ చనిపోతే డాక్టర్లదే తప్పు అన్నట్టుగా బంధువులు మమ్నల్ని కొట్టడానికి వస్తున్నారు. ఇంట్లో హాయిగా కూర్చుని ల్యాప్‌‌టాప్‌‌లో పని చేసుకునే వాళ్లు కూడా సోషల్ మీడియాల్లో మమ్మల్ని తప్పుగా చిత్రించి, కామెంట్లు చేస్తూ ఆనందం పొందుతున్నారు’ అని పార్కర్ ఆవేదనగా నాతో అన్నారు. ఇక ముంబైలోని కేఈఎం హాస్పిటల్‌‌ డీన్ డాక్టర్ హేమంత్ అన్న మాటలు విని ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ‘ఇప్పుడు బెడ్లు, మందులు, వ్యాక్సిన్ల షార్టేజీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ డాక్టర్ల కొరత వస్తే పరిస్థితి ఏంటన్నది ఆలోచించి, అంతా ఇప్పటికైనా అప్రమత్తం కావాలి’ అని ఆయన అన్నారు.

- బర్ఖా దత్, సీనియర్ జర్నలిస్ట్ (హిందుస్థాన్​ టైమ్స్​ సౌజన్యంతో)