బడ్జెట్ సెషన్స్‌లో పార్లమెంటులో రాహుల్ గాంధీ ఒక ఇంట్రెస్టింగ్ ఉపన్యాసం ఇచ్చాడు. అది మార్షల్ ఆర్ట్‌లో ప్రతికూల వ్యక్తిని లొంగదీసుకునే ఆర్టిస్ట్ గ్రిప్ ఎలా తీసుకుంటాడు, ఎలా పడగొడ్తాడు అనేది తెలిపాడు. డొనాల్డ్ ట్రంప్ మిత్రుడు..మిత్రుడు అంటూనే దేశంలోని ఆర్థిక వ్యవస్థపై సంపూర్ణ గ్రిప్ సంపాదించి దెబ్బకొట్టాడు అని చెప్పేందుకు ఆ మెటఫర్ను తీసుకున్నాడు. బీజేపీ పార్లమెంట్ సభ్యులకు రాహుల్ గాంధీ ఎందుకు చెపుతున్నాడో అర్థంకాక అరిచి గొడవ చేశారు. రాహుల్ గాంధీకి మార్షల్ ఆర్ట్‌లో ప్రవేశం ఉందని నాకు ఆయన గురించి తెలిసిన కొందరు చెప్పారు. అందుకే గ్రిప్ ఎలా దొరకబడతారో ఆయన చేతులతో యాక్షన్ చేసి చూపించాడు.
అందులో ముఖ్యమైన సమస్య అమెరికా ఇండియాను టారిఫ్ చర్చల్లో ఎలా లొంగదీసుకున్నది అనేది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే సరుకులపై సున్నా ట్యాక్స్విధిస్తాం. కానీ, మనదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ప్రతి పదార్థంపైన 18 శాతం పన్ను విధిస్తారు. ఫలితంగా మనదేశం నుంచి అమెరికాకుపోయే వస్తువులు ఆ దేశ ప్రజలు ఎక్కువ ధరలకు కొనాలి.
ఉదాహరణకు మనదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు 118 రూపాయలకు అక్కడి ప్రజలు కొంటే, అవే వస్తువులు బంగ్లాదేశ్ నుంచి అమెరికా తెప్పించుకుంటే 100 రూపాలయకే కొనుక్కోగలుగుతారు. ఈవిధంగా ధర వ్యత్యాసం వల్ల ఎక్కువ మొత్తాలు అమెరికా ప్రజలు కొనుక్కునేటప్పుడు ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దానివల్ల ఇండియా అమెరికాకు చేసే ఎగుమతులు అమ్ముడుపోక ఒకదశలో ఆ దేశం ఈ దేశం నుంచి దిగుమతి చేసుకోవడమే ఆపేస్తుంది.
ట్రంప్ రెండోసారి గెలిచినప్పటి నుంచి..
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇండియా మీద చాలా ఆక్రోశంతో పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ముందు దానికి కారణం రష్యా నుంచి ఇండియా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం కారణంగా చూపించాడు. చివరికి ఆయన ఒత్తిడితో రష్యా నుంచి అరబ్బు దేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకంటే చాలా తక్కువ ధరకు వస్తున్న ఆయిల్ కొనుగోళ్లు ఆపేశాం. అయినా ఆయన ఈ దేశంపై టారిఫ్‌ను 7శాతం మాత్రమే తగ్గించి తమ వస్తువులు మాత్రం సున్నా టారిఫ్‌తో దిగుమతి చేసుకునేటట్టు ఒత్తిడి చేశాడు.
ఈ ఒప్పందానికి చాలా బలంగా ఎదుగుతున్న ప్రపంచ మూడో అతిపెద్ద ఎకానమీ అని చెప్పే మోదీ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంది? ఇదేకాక ఈ దేశ విద్యార్థులను, అక్కడ సెటిల్ అయిన నాగరికులను వారి ఆదాయంతో సంబంధం లేకుండా రకరకాల వివక్షకు గురిచేస్తున్నారు. ఈ వివక్షల మీద భారత ప్రభుత్వం ఒక్కమాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ వివక్ష, భారతదేశం పాలకుల సైలెన్సు మతంతో ముడిపడి ఉందనే అంశాన్ని రెండు దేశాలు జాగ్రత్తగా చర్చకు రాకుండా చూస్తున్నాయి.
ఇండియాలో ఈ మధ్యకాలంలో అటు ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, క్రిస్టియన్ మత మార్పిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేసులు, దాడులు చాలా పెరిగాయి. ఇందుకు ప్రతీకారంగా అక్కడ కూడా మతపర ఆలోచనలు పెరిగి ఇండియన్లను ఇబ్బందులుపెట్టే ఆలోచన కనబడుతోంది.
ముస్లిం దేశాలలో కూడా..
ముస్లిం దేశాలలో కూడా ఇటువంటి ప్రతీకార ప్రయ త్నాలు కనబడుతున్నాయి. ఒక్క యూఏఈ నుంచే వేలాదిమంది ఇండియన్స్‌ని ఉద్యోగాలు ఊడదీసి వెనక్కి పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి మతం దేశ సంబంధాల మధ్య చిచ్చుపెట్టడం మొదలైతే అది ఆర్థిక నిర్ణయాల్లో చొరబడకమానదు. ఇక్కడ మేం హిందువులం, సెక్యులరిస్టులం కాము అని నమ్మే అధికారులను, మంత్రులను మాత్రమే బీజేపీ ప్రభుత్వం చర్చలలో కూర్చుండబెడుతున్నది.
సహజంగానే అక్కడ కూడా క్రిస్టియానిటీ పట్ల ఎక్కువ నమ్మకం ఉన్న అధికారులు, సెక్రటరీలు, ముఖ్యంగా జేడీ వాన్స్ వంటి మతవాద వైస్ ప్రెసిడెంట్‌ను చర్చల లీడర్‌గా పెడుతున్నారు. ఈ రెండు దేశాల లావాదేవీల్లో మతం బలంగా పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. అయితే, భారతదేశంలో క్రిస్టియన్లు ఈ దేశంలో మూలవాసులు. వారి తత్వంలో తాము ఏ మతంలో ఉన్నారో తెలియదు. కానీ, ఇప్పడు మేం క్రిస్టియన్లమని చెప్పుకుంటే ఈ వివక్ష జరుగుతుంది.
కానీ అక్కడ ఉన్నది మాత్రం భారతీయులు. అక్కడి ప్రజలు మనదేశం నుంచి ఉద్యోగాలను వెతుక్కుంటూ రావడం లేదు. మనవారు మాత్రం ఆ దేశాలకు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. మనది ఎంతపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పినా ఏ దేశస్తులూ ఉద్యోగాల కోసం ఇక్కడికొచ్చే వ్యవస్థ కాదు. మనం నంబర్‌వన్ అని చెప్పినా ఈ దేశ పెట్టుబడిదారులు మాత్రం ఆ దేశాలకే ఎందుకుపోతున్నారు? యువకులు ఆ దేశాలకే ఎందుకు ఉద్యోగాల కోసం పోతున్నారు? ఒక్క తెల్ల లేదా నల్ల అమెరికనో, యూరిపియనో ఈ దేశంలో ఉద్యోగం కావాలని వస్తున్నారా? అసలు ఇక్కడివారికే ఉద్యోగాలు లేనప్పుడు, అక్కడివారు ఎందుకొస్తారు?
గతంలో ఆత్మగౌరమైనా ఉండేది
గతంలో ముఖ్యంగా నెహ్రూ, మన్మోహన్సింగ్ ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్లకు ‘అసలు బలం’ ఈదేశంలో అమలవుతున్న సెక్యులరిజం, ఆలోచనా విధానం. అంతేకాకుండా మేధావులుగా నెహ్రూకు, మన్మోహన్‌కు ఉన్న గుర్తింపు. నెహ్రూ బార్గేనింగ్ పవర్ ఆయన ప్రపంచ జ్ఞానంపైన, ఆయన బలమైన ఇంగ్లిషు భాషపైన, స్వాతంత్ర్య సమరయోధుడనే గౌరవంపైన ఉండేది. నెహ్రూ స్టేట్స్‌మన్‌షిప్ తరువాత ప్రధానమంత్రులకు ఆ స్టేచర్ లేదు.
కానీ, ఇందిరాగాంధీ కూడా బంగ్లాదేశ్ వార్ సందర్భంగా బలమైన లీడర్షిప్ క్వాలిటీని కనపరిచింది. చర్చలలో ఆమె కూర్చుంటే తన పాయింట్‌ఆఫ్ వ్యూని బలంగా అమెరికన్ ప్రెసిడెంట్‌కు చెప్పగలిగే సామర్థ్యంతోపాటు, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధానమంత్రి డిగ్నిఫైడ్‌గా వ్యవహరించే నాయకురాలనే గౌరవం ఇతర దేశాల ప్రెసిడెంట్లుకు, ప్రధానమంత్రులకు ఉండేది.
నెహ్రూ కాలంలో మనదేశం చాలా బీదది. కానీ, ఆత్మగౌరవం ప్రదర్శించడంలో చాలా గొప్పది. స్వాతంత్ర్య పోరాట నాయకులుగా గాంధీకి, నెహ్రూకు, అంబేద్కర్‌కు చాలా గౌరవం ఉండేది. ఆ గౌరవం ఈ దేశాన్ని అవమానపర్చడానికి గ్రిప్ దొరకనిచ్చేదికాదు. కానీ ఇప్పుడు.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వానికి పెద్ద సమస్య లీడర్ల ఇంటలెక్చువల్ స్టేచర్ చాలా బలహీనంగా ఉంది. పోయి ఆ దేశ పెద్ద నాయకుడిని అమాంతం కౌగిలించుకుంటే నాయకుని స్టేచర్ పెరగదు. చర్చలలో ఆ లీడర్ గ్రిప్ సంపాదించలేరు. ఒక దేశ లీడర్‌పై వాళ్ల దగ్గర ఉన్న రిపోర్టు, అతని జ్ఞానప్రక్రియ, అతను లేదా ఆమె మాట్లాడే విధానం చాలా ముఖ్యమైనవి. ఎదుటివారిని పొగిడితే సరిపోదు.
ఒక పాలకుడు రోజువారీ పనిగా మసీదులోనో, చర్చిలోనో, గుడిలోనో కనిపిస్తున్నాడంటే ఆ వ్యక్తికి ఆధునిక సైంటిఫిక్ పరిజ్ఞానం తక్కువ, రాజ్య వ్యవహారాలు నడిపే పరిజ్ఞానం తక్కువ అని మేధావివర్గం అంచనా కడుతుంది. భారతదేశం క్రమంగా సంక్షేమ రాజ్యం కాదు. మతరాజ్యం అనే ఆలోచన ప్రపంచమంతా ప్రబలింది.
మన గ్రామాల్లో అనుకున్నట్టు ముల్లును ముల్లుతోటే తీయాలన్నట్టు బయట అన్ని దేశాలు ఇక్కడి మత రాజకీయాలు, ఆ దేశంలోని మత రాజకీయ మేధావివర్గాన్ని ముందుపెట్టి చర్చలు జరిపిస్తున్నాయి. ఈ దేశ విదేశాంగ మంత్రి శంకర్ ఎన్ని అమెరికా ట్రిప్పులు కొట్టినా రెండు దేశాల సంబంధాల్లో మార్పు కనిపించేటట్టు లేదు. అక్కడి రాయబారులు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా వారి దృష్టి ఈ దేశంపై మారడం లేదు. అయితే దీని ప్రభావం దేశంపై ముందుముందు ఎంత తీవ్రంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
ట్రంప్ బెదిరింపులు ఆగడం లేదు
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ కేసు నడుస్తుండగానే ట్రంప్ ఇండియాపై చాలా అవమానకరమైన ప్రకటన చేశాడు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా ఇండియా మాత్రం 8శాతం టారిఫ్ చెల్లించాల్సిందే. వారికి మేం జీరో పర్సెంటు టారిఫ్‌తో మాత్రమే బిజినెస్ చేస్తాం అని మళ్లీ చెప్పాడు. ఇండియా, పాకిస్తాన్ (సిందూర్) యుద్ధ సమయంలోనే నేను చెప్పినట్టు యుద్ధాన్ని ఆపకపోతే 200 శాతం టారిఫ్ విధిస్తాను అని కూడా మళ్లీ చెప్పాడు. ఇంతకంటే అవమానం ఏం ఉంటుంది?.
ప్రస్తుతానికి ఇతర దేశాలతో మన సంబంధాలను ఆర్థిక లావాదేవీల నుంచి, మతాల కోణం నుంచి పరిశీలించడానికి అన్ని దేశాలు చూస్తున్నాయి. ఏ దేశమైనా మత పరిభాషలో పరిపాలన జరిపితే మిగతా దేశాలు కూడా ఆ పరిభాష నుంచే అంతర్జాతీయ ఒప్పందాలను చూస్తాయి. ముస్లిం దేశాలు మరీ ముఖ్యంగా ఆ సంబంధాలను రెండు రాజ్య సంబంధాల కంటే రెండు మతాల సంబంధాలుగా భారత్‌తో వ్యవహరిస్తున్నాయి.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
