‘ఆమె’నే పరిపాలించనివ్వండి.. పేరుకు మాత్రమే మహిళా చైర్పర్సన్లు, మేయర్లు.. పెత్తనం అంతా..

‘ఆమె’నే పరిపాలించనివ్వండి.. పేరుకు మాత్రమే మహిళా చైర్పర్సన్లు, మేయర్లు.. పెత్తనం అంతా..

ఆకాశంలో నువ్వు సగం నేను సగం అనే స్థాయి వరకు మహిళా లోకం ఎదిగింది. ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ స్థాయి మొదలు అత్యున్నత స్థానమైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను మహిళలు అధిష్టించారు. ఆకాశమే హద్దుగా అంతరిక్షంలో విహరించే స్థాయి వరకు మహిళలు ఎదిగారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళ పేరిటనే అందించడం హర్షణీయం. 

ప్రభుత్వం అందించే రుణాల్లో సైతం వారికే  పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతి ప్రభుత్వాలుగా పేరు తెచ్చుకునేందుకు ఆయా పార్టీలు, ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అది మంచి పరిణామమే.   మహిళ సాధికారత దిశగా అడుగులేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది.   మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలు  పై చేయి  సాధించారు.  అత్యధిక చైర్మన్,  మేయర్  స్థానాలను  కైవసం చేసుకున్నారు. ఇతర రంగాల్లో మహిళలకి 33శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 

కుటుంబ సభ్యుల పెత్తనంపై ఆరోపణలు..
ఇటీవల జరిగిన మున్సిపాలిటీ  కార్పొరేషన్ల  ఎన్నికల్లో  మాత్రం  ఏకంగా 60 శాతం పైగా  సీట్లలో మహిళలు ఆసీనులయ్యారు. మహిళా రిజర్వేషన్ స్థానాలతో పాటు అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనరల్ స్థానాల్లో సైతం మహిళలు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో  జరిగిన  మున్సిపాలిటీ  ఎన్నికల్లో మహిళలు పోటీకి అధికంగా ఆసక్తి చూపారు.

ఇందులో  అత్యధికంగా  యువతులు విద్యాధికులుగా ఉన్నట్లు  తెలుస్తోంది.  అక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ  పరిపాలనకు  సంబంధించిన  అంశాలలో వారి కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువగా ఉంటోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  కేవలం పేరుకు  మాత్రమే  మహిళలు  చైర్​పర్సన్ గా,   మేయర్లుగా  ఎన్నికైనప్పటికీ వారి వెనకాల వారి కుటుంబ సభ్యుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండటం సరికాదు.  మహిళలు వారి పరిపాలనపై  ప్రత్యేక  ముద్ర పడడం లేదని  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తీరు మారాలి.

పదవుల్లో ఉన్న మహిళలకు స్వేచ్ఛనివ్వాలి
మహిళలు పరిపాలించే శక్తి , సామర్థ్యాలు ఉన్నప్పటికీ వారి వెనకాల ఉండే శక్తులు ఆమె నిర్ణయాల్లో జోక్యం కల్పించుకొని కేవలం రబ్బర్ స్టాంపులాగానే మహిళలు ఉంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నప్పటికీ రాజకీయ రంగంలో మాత్రం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారు. రాజకీయ రంగంలోనే వారు వెనుకకు నెట్టివేయబడుతున్నారని తెలుస్తుంది.

పాలనా రంగంలో సైతం వారి పనులను వారే  చేసేలా మహిళా నేతలకు  ప్రోత్సాహం అందించాలి. వారిని అడ్డుపెట్టుకొని ఇతరులు పెత్తనం చలాయించడం పట్ల రాజకీయ రంగంలో అవినీతి పెరిగిపోవడమే కాకుండా ప్రజలకు సుపరిపాలన అందించడం గగనంగా మారింది . వారి బాధ్యతల్లో పదవుల్లో వారికి స్వేచ్ఛనివ్వాలి.  పరిపాలనలో వారిదైన ముద్ర ఉండేటట్టు సహకరించాలి. కుటుంబ సభ్యులు వారి బాధ్యతల్లో తలదూర్చి మహిళా నేతల పదవులకి అన్యాయం చేయొద్దు.

తాళ్ళపెల్లి సురేందర్​

* NOTE: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 

* స్వీయ రచన అయి ఉండాలి.