ఈహెచ్ఎస్ పథకం ఉద్యోగుల ఆరోగ్యాన్ని రక్షించేనా ? ఉద్యోగుల భయాలివి..!

ఈహెచ్ఎస్ పథకం ఉద్యోగుల ఆరోగ్యాన్ని రక్షించేనా ? ఉద్యోగుల భయాలివి..!

ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయాలు అందించే నూతన ఆరోగ్య పథకం అమలులోకి రానుంది. ఇందుకు ఉద్యోగులు, పెన్షనర్లు తమ బేసిక్ పే( మూల వేతనం) / పెన్షన్ నుంచి 1.5 శాతం చందాగా చెల్లించాలి. దీనికి సమానంగా ప్రభుత్వం కూడా 1.5 శాతం మొత్తాన్ని కేటాయిస్తుంది. 

ఈ మొత్తం సుమారు రూ.1,056 కోట్లుగా ఉంటుంది. ఈ మొత్తంలో నుంచి ఉపాధ్యాయులు, పెన్షనర్లు కలిసి 7.14 లక్షల మంది, వారి కుటుంబ సభ్యులు 12.84 లక్షల మందికి వైద్య చికిత్స కోసం 515 ఆసుపత్రులను గుర్తించి మొదటి విడతగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.

ఈ పథకం రెగ్యులర్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్  పెన్షనర్లకు వర్తిస్తుంది. ఆరోగ్య భద్రత పథకం వర్తించే పోలీసుశాఖను, సహాయతా పథకం వర్తించే ఎక్సైజ్ శాఖలను కూడా ఈ పథకంలో చేరుస్తారు.  ప్రభుత్వరంగ సంస్థలు, మోడల్, ఎయిడెడ్‌ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి.. పథకం ప్రారంభమైన తర్వాత ట్రస్టులో తీర్మానం చేసి వర్తింపజేస్తారు. సరిహద్దు జిల్లాల్లో ఉన్నవారు పక్క రాష్ట్రాల్లో అత్యవసరంగా చికిత్స పొందినప్పుడు ఈహెచ్ఎస్‌ వర్తింపజేసే విషయం పరిశీలిస్తారు. ఎట్టకేలకు కొన్ని అనుమానాలు, లోపాలతో  కూడినప్పటికీ ఈ పథకం అమలు ఆహ్వానించదగ్గది.

ఉమ్మడి రాష్ట్రంలో సమగ్ర వైద్య చికిత్స నిబంధనలు - 1972 ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగులకు తొలిసారిగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకైన  వైద్య ఖర్చులు పొందడానికి ప్రభుత్వం రీయింబర్స్​మెంట్​ సౌకర్యం కల్పించింది. ఉద్యోగులు  ఆసుపత్రుల్లో  చెల్లించే బిల్లులకు, ప్రభుత్వం ప్యాకేజీ రేట్ల పేరుతో చెల్లిస్తున్న మొత్తానికి చాలా తేడా ఉండడం, ముందుగా డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకోలేక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి అవుతున్న దృష్ట్యా, నగదు రహిత చికిత్స జరిగే విధానం 2013 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

గరిష్ట పరిమితి లేకుండా, అవుట్ పేషెంట్ చికిత్సను కూడా అనుమతించేవిధంగా ఆరోగ్య కార్డులు జారీ చేసి రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఉంది. అయితే ఈ ఆరోగ్యకార్డుల ద్వారా అయ్యే చికిత్స ఖర్చులు ప్రభుత్వమే ఆసుపత్రులకు చెల్లిస్తుంది. ఉద్యోగుల నుంచి చందా రూపంలో వసూలు చేయదు. పూర్తిగా ఉచితం. చికిత్స ఖర్చుల చెల్లింపు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్యాకేజీ రేట్ల ప్రకారం ప్రతి రోగానికి నిర్దేశించిన రేట్ల ప్రకారం జరుగుతుంది.

ఆరోగ్య కార్డులు పనిచేయకపోవడంతో ఆందోళన
 ప్రభుత్వం సకాలంలో ఉద్యోగుల చికిత్సకు సంబంధించిన బిల్లులను ఆసుపత్రులకు చెల్లించకపోవడంతో,  కొన్నిసార్లు ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉండడంతో ఉద్యోగుల ఆరోగ్యకార్డులతో చికిత్స చేయడం కార్పొరేట్ ఆసుపత్రులు మానేశాయి. దీంతో ఉద్యోగులు సొంత డబ్బు చెల్లించి, చికిత్స ఖర్చులు భరిస్తున్నారు. ఈ ఖర్చులను తర్వాత రియింబర్స్​మెంట్​ రూపంలో  చెల్లించుటకు ప్రభుత్వానికి తమ తమ శాఖల ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు.

రియింబర్స్​మెంట్​ దరఖాస్తులను  సంబంధించిన శాఖల నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​కు అంతిమంగా స్క్రూటినీకి  పంపగా వచ్చే మొత్తాలు, ఆసుపత్రిలో ఉద్యోగులు చికిత్సకు చెల్లించిన మొత్తానికి తేడా ఉండి ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.  నగదు రహిత చికిత్స అనుమతించే ఆరోగ్య కార్డులు పనిచేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది.

ఆసుపత్రులు ఆరోగ్య కార్డులను అనుమతించకపోవడానికి ప్రధాన కారణం సిజిహెచ్ఎస్ ప్యాకేజీ రేట్ల ప్రకారం చికిత్స బిల్లులను చెల్లించడం వలన వాస్తవంగా చెల్లించే మొత్తానికి ఆసుపత్రులకు అయ్యే ఖర్చులకు తేడా ఉంటుంది. ఈ రేట్లు ప్రైవేటు ఆసుపత్రులకు గిట్టుబాటు కాకపోవడంతో వారు ఆరోగ్య కార్డులతో చికిత్స చేయడం మానేశారు. 

అంతేకాదు జిల్లా, తాలూకా కేంద్రాల్లోని ఆసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు ఒకే చికిత్స ఖర్చులు ఉండడం మరో కారణం. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయుటకు ఆరోగ్యశ్రీ  ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు స్వతంత్రంగా ట్రస్ట్ ఏర్పాటు చేయకపోవడంతో, ఉద్యోగులకు ప్రత్యేకంగా చికిత్స ప్రక్రియను అమలు చేయడానికి ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదురై, ఆసుపత్రిలో చేరిన ఉద్యోగులు కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగుల భయాలు
ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిస్థితి దయనీయంగా ఉంది ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స చేయడం లేదు. 

ప్రభుత్వానికి ఆసుపత్రులపై నియంత్రణ లేనప్పుడు ఈ కొత్త ట్రస్టు  మెరుగైన సేవలు అందిస్తుందా  అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే వైద్య సేవలు అందవని, 'నిధులు లేవు' అనే సమాధానం వినాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈహెచ్ఎస్ స్కీంలో అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మినహాయింపు ప్రకారం నెలకు లక్ష రూపాయల జీతం తీసుకునే ఉద్యోగి ప్రతినెల రూ. 1,500, ప్రభుత్వం రూ. 1,500  చొప్పున  నెలకు రూ. 3,000 అవుతోంది. ఈ మొత్తానికి ప్రైవేటు రంగంలో ఉత్తమ ఆరోగ్య పాలసీలు ఉన్నాయి. మరి ఈ పథకంలో ఉన్న గొప్పతనం ఏముంది? 

ఇప్పటికే ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, తాము దాచుకున్న  జీపీఎఫ్, గ్రూప్  ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను చెల్లించడానికి ప్రభుత్వం నెలలు తరబడి ఆలస్యం చేస్తోంది.  అటువంటప్పుడు ఈ ట్రస్ట్ నిధులు ఇతర అవసరాలకు మళ్ళించరని గ్యారెంటీ ఏమిటి? అత్యవసర వైద్య పరిస్థితి తలెత్తి ఉద్యోగి ఆస్పత్రిలో చేరినప్పుడు, నిధుల కొరత నెపంతో చికిత్సకు ఆటంకం కలగకూడదని వారు కోరుకుంటున్నారు.

ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యం
ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వాల రాజ్యాంగ కర్తవ్యం. అటువంటి ప్రజారోగ్యాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ చికిత్సలు అందరికీ అందుబాటులోకి రాకపోవడం, ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్సలతో రోగుల ప్రాణాలను రక్షించడంతో,   ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆర్థికంగా కొంత మెరుగైన స్థితిలో ఉండే ఉద్యోగులు తమ ప్రాణాలను రక్షించుకోవడం సాధారణమైంది. 

ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు నగదు రహిత చికిత్స పథకం ప్రవేశపెట్టాలని ఉద్యోగులు తమ సంఘాల ద్వారా కోరుతున్నారు. ఈ లోగా పేదలకు వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స లభించకపోవడంతో వారు తమకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతి ఇచ్చే విధానం కోసం డిమాండ్ చేశారు. వారి డిమాండ్ ను తీర్చడం పార్టీలకు ప్రజాకర్షణ పథకంగా మారి ఆరోగ్యశ్రీ పథకం ముందుకొచ్చింది.

పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం సామాన్య ప్రజల కన్నా మరింత సంఘటిత  శక్తిగా ఉన్న ఉద్యోగులు తమ సంఘాల ద్వారా చేసిన డిమాండుకు ప్రతిరూపమే నగదు రహిత చికిత్సను అనువదించే ఉద్యోగుల ఆరోగ్య పథకం. 

నిజానికి ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయలు రియింబర్స్​మెంట్​  రూపేణా  చెల్లించే ప్రభుత్వం, ఆ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేయడానికి,  అత్యాధునిక చికిత్స వసతులను కల్పించడానికి, తగినంత మంది  డాక్టర్లను నియమించడానికి ఉపయోగిస్తే ఉద్యోగులతో పాటు ప్రజలందరికీ ఉచితంగా ఆరోగ్యాన్ని అందించవచ్చు. 

ప్రాణరక్షణే ధ్యేయంగా.. మార్గదర్శకాలు రూపొందించాలి
ప్రస్తుతం ఎంప్లాయీ హెల్త్​కేర్‌ ట్రస్టులో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని  ట్రస్టు సీఈవోగా నియమిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఛైర్మన్‌గా ఉంటారు. 

ఈ ట్రస్ట్ కు ప్రతి ఉద్యోగి నుంచి నెల నెలా చందా మినహాయింపు జరిగినట్టే, ప్రభుత్వం తన వాటాను ట్రస్టుకు ప్రతి నెల మొదటి తేదీనే జమ చేసేలా నిబంధనలు రూపొందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించకుండా చూడాలి. ఆరోగ్యకార్డు ఉన్న ప్రతి ఉద్యోగి రెఫరల్ హాస్పిటల్లో చేరినప్పుడు జనరల్ రోగులవలె చికిత్స జరగాలి.

ఈహెచ్ఎస్ రోగి అని వివక్ష ఉండకూడదు. ఉద్యోగి ప్రాణరక్షణే ధ్యేయంగా ఆసుపత్రులు చికిత్స జరిపేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ఈహెచ్ఎస్ నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో వెల్​నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆ సెంటర్లలో డాక్టర్లను నియమించి, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులకు విశ్వాసం కలుగుతుంది. ఉద్యోగుల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది.

కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకుడు

* NOTE: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.