ధర్నా చేస్తే బెదిరింపులా? : మైసా శ్రీనివాసులు

ధర్నా చేస్తే బెదిరింపులా? : మైసా శ్రీనివాసులు

టీచర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నది. 317 జీవో బాధితులైన స్పౌజ్ టీచర్స్ బ్లాక్ లిస్టులో పెట్టిన13 జిల్లాల్లో బదిలీలు నిర్వహించాలని సంవత్సర కాలంగా అనేక దఫాలుగా ఆఫీసర్లకు, ప్రభుత్వానికి, విజ్ఞప్తులు చేస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. పిల్లాపాపలతో రోడ్డెక్కి విద్యాశాఖాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రికి తెలిసేలా ఆందోళన చేస్తూ కష్టాలు చెప్పుకుంటున్నారు. అయినా నేటికీ వారి సమస్యను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించకుండా, పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నది. త్వరలో జరగబోయే బదిలీల కౌన్సెలింగ్ కు ముందు దంపతుల బదిలీలు నిర్వహించాలని చంటి పిల్లలతో  ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు తల్లులను, పిల్లలను వేరు చేస్తూ దౌర్జన్యంగా అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించడం అమానవీయం. కుటుంబంతో కలిసి జీవించడం జీవించే హక్కులో భాగం. ఇది రాజ్యాంగ బద్ధ హక్కు మాత్రమే గాక సహజ హక్కు కూడా. హక్కులను కాపాడండి అని కోరడం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి ఆ హక్కులను ఉల్లంఘించింది. సమస్య పరిష్కరించాలని కోరితే నేరంలా భావించడం సరికాదు. తామే సృష్టించిన సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తూ ఇంతదాకా తీసుకొచ్చిన అధికారులు, ప్రభుత్వమే వాస్తవంగా దోషులుగా నిలబడాలి. ఆందోళనలో పాల్గొన్న కొంతమంది టీచర్లను స్కూల్​ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ఆఫీసుకు పిలిపించి బెదిరించిన విధానం బాధ్యతారహితంగా ఉంది.

బ్లాక్​ చేసిన జిల్లాల్లో పైరవీలు?

స్కూల్​ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ హోదాలో ఉంటూ, ప్రశాంత వాతావరణంలో బోధన జరిగేలా చూడాల్సిన ఆఫీసర్​ పరుష పదజాలంతో టీచర్లపై విరుచుకుపడటం చట్టవ్యతిరేకం. ఈ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లను ఆక్రోశానికి  గురిచేస్తున్నాయి. అధికారుల నుంచి పిలుపు వస్తే తమ సమస్యల పట్ల సానుభూతి వ్యక్తం అవుతుందనే ఆలోచనతో వెళితే, వారిని వ్యక్తిగతంగా బెదిరించి సెలవు పెట్టి వచ్చారా అని డీఈవోలకు ఫోన్ చేస్తూ  బెదిరించడం ఏ మాత్రం సరికాదు. అనుచిత, అహంకార విధానానికి నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటికైనా బ్లాక్​ చేసిన13 జిల్లాల బాధిత స్పౌజ్ టీచర్స్ బదిలీలు నిర్వహించాలి. ఆ13 జిల్లాలకు ఏడాది కాలంగా బదిలీలపై నిషేధం అంటూనే వ్యక్తిగతంగా అక్రమంగా పైరవి బదిలీలు కోరుకున్న వారికి నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 317 జీవో రావడమే నిబంధనలకు విరుద్ధం. ఇప్పటికీ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సుమారు14 మంది చనిపోయిన సంగతి అందరికీ తెలుసు. పాఠశాలలోనే గుండెపోటుకు గురై మరణించిన వారు చాలా మంది ఉన్నారు. ఇంత మంది మరణాలకు కారణమైన జీవోను ప్రభుత్వం పునఃపరిశీలన చేయక పోవడం, బాధితులకు న్యాయం చేయకపోవడం ప్రభుత్వ బాధ్యతారహితంగానే పరిగణించాలి. 317 జీవో రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న విషయం పట్ల ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కూడా సీరియస్ గా తీసుకోకవడం వల్ల ఇటువంటి ఆందోళనలు అనివార్యం అవుతున్నాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో నిరసనలను ఆ కోణంలోనే చూసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. బాధిత టీచర్ల ఉద్యమం న్యాయమైనది. ప్రజాస్వామికంగా, శాంతియుతంగా ఏడాది నుంచి వారంతా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

- మైసా శ్రీనివాసులు, మాజీ ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్