
రోజూ పాలు తాగితే ఎముకలు బలం.. చిన్న పిల్లలకు ఎక్కువగా పాలు తాగించాలి.. ఎదిగే వయసులో ఇది వారికి ఉపయోగపడుతుంది. ఎముకలు ధృడంగా పెరుగుతాయి. ఇలా ఎముకల ఆరోగ్యంపై పాలు ప్రభావాన్ని చెప్పడం మనం వింటుంటాం.. అయితే ఎముకల ఆరోగ్యానికి ఒక్క పాలు తాగితేనే కాల్షియం లభిస్తుందా? ఒక్క పాల వినియోగంతోనే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.. వాస్తవాలేంటీ.. అపోహలేంటీ తెలుసుకుందాం..
దశాబ్దాలుగా పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే బలమైన ఎముకలకు పాలు ఒక్కటే చాలు అనేది అపోహ మాత్రమే. పాలల్లో కాల్షియం, విటమిన్ డి ఉంటుంది.. కానీ అది పెద్దయ్యాక ఎముకలు బలంగా ఉండేందుకు సరిపోదు. ఎముకల బలానికి మరింత ఆహారం అవసరం అంటున్నారు డాక్టర్లు.
కాల్షియం ఎముకల పెరుగుదల, ధృడత్వంలో చాలా కీలకం.. విటమిన్ డి దాని శోషణంలో సాయపడుతుంది. అయితే వీటితోపాటు వివిధ పోషకాలు, జీవన శైలి, వ్యాయామం, ఆహారం అలవాట్లు అన్ని కలిసి ఎముకలను బలంగా ఉంచుతాయంటున్నారు ఆర్టెమిస్ హాస్పిటల్స్‌లోని ఆర్థో స్పైన్ మరియు ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ ధీరజ్ భటేజా. పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు అనిపించొచ్చు కానీ.. మిగతావాటి లోపాలను పూడ్చాలంటే మరింత ఆహారం అవసరం అంటున్నారు.
కాల్షియం, విటమిన్ డి గురించి నిజాలు..
పాలునుంచే కాకుండా ఇతర ఉత్పత్తులనుంచి కూడా కాల్షియం పొందవచ్చు. పెరుగు, జున్ను, పాలకూర, కాలే వంటి ఆకుకూరలు, టోఫు, బాదం, నువ్వులు ,బలవర్థకమైన తృణధాన్యాల నుంచి కూడా కాల్షియం లభిస్తుంది. ఎండలో ఉండటం, గుడ్లు, కొవ్వు చేపలు, బలవర్థకమైన ఆహారం తినడం ద్వారా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. తగినంత విటమిన్ డి లభించకపోతే మీరు ప్రతిరోజూ పాలు తాగినప్పటికీ మీ శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించదు.
►ALSO READ | health foods: తెల్ల ఉల్లిగడ్డ vs ఎర్రఉల్లిగడ్డ:ఏదీ బెటర్?
ఇతర పోషకాలతో..
ఎముకలు బలంగా, సరైన పోషణ పొందాలంటే వాటికి మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం ,విటమిన్ కె కూడా అవసరం. ఈ ముఖ్యమైన పోషకాలు తృణధాన్యాలు, గింజలు, గింజలు ,ఆకుపచ్చ కూరగాయల నుంచి లభిస్తాయి. ఒకే ఆహారంపై దృష్టి పెట్టకుండా వివిధ రకాల తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం మొత్తం ఎముకల బలాన్ని పెంచుతాయంటున్నారు డాక్టర్లు.
జీవనశైలి కూడా ముఖ్యం..
శరీరం కష్టపెట్టకుండా నిశ్చలంగా ఉంటే ఎంత తిన్నా ఎముకలకు రక్షణ ఉండదు. నడక, జాగింగ్, డ్యాన్స్, బరువు మోసే పనుల వంటివి ఎముక నిర్మాణాన్ని ప్రేరేపిస్తాయి. ఎముకల నష్టాన్ని తగ్గిస్తాయి. పొగతాగడం, మద్యం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
వయస్సు,హార్మోన్ల కారకాలు
వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా హార్మోన్ల మార్పులు ఎముకల బలాన్ని వేగంగా కోల్పోయేలా చేస్తాయి. 40 ఏళ్లు పైబడిన మహిళలు ఒక్క పాలు తాగితే సరిపోదు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఎముక బలాన్ని నిర్ధారించుకునేందుకు తరుచుగా డాక్టర్లను సంప్రదించాలి.
పాలు ఆరోగ్యానికి మంచివి.. కానీ బలమైన ఎముకలకు ఇది అద్భుత నివారణ కాదు. బలమైన ఎముకలు కావాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.మంచి అలవాట్లు కలిగి ఉండాలి. ఎముకలు బలంగా ఉండటానికి కేవలం ఒక గ్లాసు పాలు మాత్రమే కాదు. బలమైన జీవితాన్ని గడపాలి.