సాంకేతిక పరిజ్ఞానం, చట్టంకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నంత కాలం పైరసీని పూర్తిగా ఆపడం అసాధ్యం. ఒకదాన్ని మూసేస్తే మరొకటి పుట్టుకొస్తుంది. 'వేక్-ఎ-మోల్' ఆటవంటిది. ఒక ఐబొమ్మ సైట్‌ను బ్లాక్ చేసినా, దాని మిర్రర్ వెర్షన్‌లు లేదా కొత్త వెర్షన్ సైట్‌లు వెంటనే ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఆన్లైన్ పైరసీ గురించి ఈ రోజుల్లో ఎంత మాట్లాడినా తక్కువే. ప్రత్యేకించి మన తెలుగు సినిమా పరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టింది ఐబొమ్మ అనే వెబ్‌సైట్. అసలు వీళ్లు పైరసీకి పాల్పడుతున్నారా? అంటే, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయా? అన్నంత అమాయకమైన ప్రశ్న ఇది! ఐబొమ్మ నిర్వాహకులు చాలా 'సామాజిక సేవకులు'.
సినిమా చూడడానికి టికెట్ కొనే స్థోమత లేని పేదల కోసం, సినిమా విడుదలైన కొద్దిగంటల్లోనే ఏ కష్టమూ లేకుండా, హెచ్డీ క్వాలిటీలో ఉచితంగా అందించిన ‘ఉత్తములు’. నిజం చెప్పాలంటే ఐబొమ్మను ఒక డిజిటల్ పరోపకారిగా మార్చారు. ఈ వెబ్‌సైట్‌ను ఆపేందుకు పోలీసులు, నిర్మాతలు ఎంత ప్రయత్నించినా.. డొమైన్లు మారుస్తూ, అడ్డంకులను ఛేదిస్తూ, 'మాకు చట్టం వర్తించదు' అన్నట్టు వ్యవహరించిన తీరు వీరు నిజంగా పైరసీ మాఫియాకి డిజిటల్ దేవుళ్లుగా వెలుగొందారు.
పైరసీ మృత్యు ఘాతం
చలనచిత్ర పరిశ్రమకు పైరసీ అనేది మృత్యుఘాతంలా పరిణమించింది. ముఖ్యంగా ఐబొమ్మ వంటి అంతర్జాతీయ సంస్థల విస్తరణ, ఈ సమస్యను కేవలం కాపీరైట్ ఉల్లంఘన స్థాయి నుండి వ్యవస్థీకృత ఆర్థికనేరం స్థాయికి పెంచింది. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేయడం ఒక తాత్కాలిక విజయమే తప్ప, ఈ పైరసీ సామ్రాజ్యపు వేర్లను పూర్తిగా పెకిలించినట్టు కాదు.
యాంటీ-వీడియో పైరసీ సెల్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. భారతదేశంలో సృజనాత్మక హక్కులను పరిరక్షించడానికి బలమైన చట్టాలు అమలులో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చట్టం, 1952 (సవరణ 2019) ప్రకారం నిర్మాత లిఖితపూర్వక అనుమతి లేకుండా సినిమాను కాపీ చేయడం లేదా ప్రసారం చేయడం తీవ్ర నేరం.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రవి అని గుర్తించారు. ఇతను ప్రస్తుతం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం కలిగి ఉండటం ఈ నేరాల అంతర్జాతీయ స్వభావాన్ని తెలుపుతుంది. ఈ చర్యలు 66 సి, 66 ఇ ఐటీ చట్టం, 318(4) r/w 3(5) భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)తో పాటు 63, 65 కాపీరైట్ చట్టం వంటి కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితులు డొమైన్లను నిరంతరం మారుస్తూ క్లౌడ్‌ఫ్లేర్ హోస్టింగ్ ద్వారా అనామకత్వాన్ని, వీపీఎన్‌లు, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు (క్రిప్టోకరెన్సీ, ఆఫ్‌షోర్ బ్యాంకింగ్) అత్యాధునిక ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగించి చట్టం కళ్లు గప్పి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
జీరో- టాలరెన్స్ వ్యవస్థను అమలు చేయాలి
పైరసీపై నిరంతర యుద్ధంలో గెలవడానికి కేవలం అరెస్టులు, బ్లాకింగ్‌లు సరిపోవు. ఒక సమగ్ర, బహుముఖ కార్యాచరణ ప్రణాళిక అవసరం. అందుకు న్యాయపరమైన సంస్కరణలు చేయాలి. ప్రత్యేకించి శిక్షణ పొందిన, పోలీసు సిబ్బందితో కూడిన రాపిడ్ రెస్పాన్స్ సైబర్ బ్రాంచులను ఏర్పాటు చేయాలి. అంతేకాక ఈ నేరాలలో నిబంధనలను కఠినతరం చేయాలి. తద్వారా నిందితుల్లో చట్టంపట్ల భయం పెరుగుతుంది. కొత్త పైరసీ కంటెంట్‌ను, మిర్రర్ డొమైన్లను ప్రసారం చేసే ప్రయత్నాలను కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ద్వారా తక్షణమే గుర్తించి బ్లాక్ చేయగల జీరో- టాలరెన్స్ వ్యవస్థను అమలు చేయాలి.
ముఖ్యంగా పైరసీ నెట్‌వర్క్‌ల ఆర్థిక మూలాలను స్తంభింపజేయడానికి విదేశీ సర్వర్‌లు, చెల్లింపుల గేట్‌వేలు, క్రిప్టో లావాదేవీల డేటాను పంచుకోవడానికి ఇంటర్‌పోల్ సహకారం తీసుకోవాలి. అంతర్జాతీయ సైబర్ ఏజెన్సీలతో ఒప్పందాలను పటిష్టం చేయాలి. సృజనాత్మక హక్కుల విలువపై ప్రజల్లో చైతన్యాన్ని పెంచాలి. పైరసీ లింక్‌లను, వెబ్‌సైట్‌లను అజ్ఞాతంగా, సులభంగా నివేదించడానికి ఒక సులభమైన ప్రభుత్వ పోర్టల్‌ను విస్తృతం చేయాలి.
ఈ సంక్లిష్టమైన సమస్యను ఎదుర్కోవడానికి సినీ పరిశ్రమ, చట్టాన్ని అమలుచేసే సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసికట్టుగా పోరాడాలి. కేవలం అరెస్టుతో సంతృప్తి చెందకుండా ఈ డిజిటల్ మాఫియాను ప్రతిస్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన కళ, సృజనాత్మకతకు ఉన్న న్యాయపరమైన హక్కు సురక్షితంగా ఉండాలంటే ఈ పోరాటంలో మనమంతా భాగస్వామ్యం వహించాలి.
అత్యాధునిక ఎన్క్రిప్షన్ టెక్నాలజీ
ఈ నెట్‌వర్క్ కేవలం అప్‌లోడ్ చేసి వదిలేయడం లేదు. డొమైన్లను నిరంతరం మారుస్తూ, వీపీఎన్ లు, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు, అత్యాధునిక ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగించి చట్టం కళ్లుగప్పి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఒక చేదు నిజాన్ని అంగీకరించాలి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్నంతకాలం పైరసీని పూర్తిగా అరికట్టడం అసాధ్యం.
ఒక సైట్‌ను బ్లాక్ చేసినా దాని మిర్రర్ వెర్షన్‌లు లేదా కొత్త వెర్షన్‌సైట్‌లు వెంటనే మరోరూపంలో ప్రత్యక్షమవుతాయి. సినిమా విడుదలైన కొద్దిగంటల్లోనే హెచ్డీ నాణ్యతతో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడానికి కారణం ఈ పటిష్టమైన అంతర్జాతీయ నెట్‌వర్కే. దీనిని ఒక్కసారిగా నిర్మూలించలేం. ఇది నిరంతరంగా, దీర్ఘకాలికంగా, అత్యంత పట్టుదలతో కొనసాగించాల్సిన న్యాయ యుద్ధం. అందుకే కేవలం 'ఆపేస్తాం' అనే హామీ కాకుండా, చట్టం పట్ల భయాన్ని పెంచే నిరంతర చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.
డా.కట్కూరి, న్యాయ నిపుణుడు
