ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా..?

ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా..?

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా ? అసెంబ్లీకి ఆ వివరాలను ఇవ్వకుండా తప్పుడు లెక్కలను చూపిస్తోందా ? ఇటీవల రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) విడుదల చేసిన గణాంకాలు, ఇప్పటికే వచ్చిన కాగ్​ నివేదికలకు.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో పెట్టిన అప్పుల లెక్కలకు పొంతనే లేకపోవడం ఈ సందేహాలకు తావిస్తోంది. గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోయింది.  

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రూ.45 వేల కోట్ల లోన్లు తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్​లో బాజాప్తా ప్రస్తావించింది. దీంతో మొత్తం అప్పు  రూ.3.57 లక్షల కోట్లకు చేరుకుంటుందని సభకు నివేదించింది. వీటికి అదనంగా బడ్జెటేతర అప్పులు రూ.1.35 లక్షల కోట్లు ఉన్నాయి. వీటిని బడ్జెట్​లో చూపించకుండా.. ప్రభుత్వం కొత్త కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అప్పులు తెచ్చినందుకే రుణభారం పెరిగిపోయిందనే అభిప్రాయాలున్నాయి. ఇవి కూడా కలిపితే అప్పుల కుప్ప మొత్తం రూ.4.92 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అంటే.. 2024 మార్చి నాటికి రాష్ట్రం అప్పులు రూ.5 లక్షలకు చేరుకుంటాయి. కానీ... దాదాపు రూ. 30 వేల కోట్ల అప్పును ప్రభుత్వం బడ్జెట్​ లెక్కల్లో చూపించకుండా దాచిపెట్టిందనే వాదనలు ఉన్నాయి. 

కాగ్​ అకౌంట్లలో బండారం

కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్​) తెలంగాణ ప్రభుత్వ అకౌంట్లను ప్రతి ఏడాది సభకు సమర్పిస్తోంది. గత ఏడాది 2020–21 అకౌంట్లను సమర్పించింది. అందులో తెలంగాణ ప్రభుత్వం అప్పు మొత్తం రూ.2.75 లక్షల కోట్లుగా ఉంది. కానీ తాజాగా ఇచ్చిన బడ్జెట్​ ఇన్​ బ్రీఫ్​​లో 2021 మార్చి నాటికి ఉన్న అప్పును కేవలం రూ.2.44 లక్షల కోట్లుగా సర్కారు చూపించింది. దీంతో ప్రభుత్వం అప్పులు దాచిపెట్టి అసెంబ్లీకి తప్పుడు లెక్కలు ఇచ్చిందనే అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర అప్పులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్​లో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా  పేర్కొంది. ఎఫ్ఆర్‌‌బీఎం పరిధిలో తీసుకున్న మార్కెట్​ రుణాలు 2023 మార్చి నాటికి రూ.3.66 లక్షల కోట్లకు చేరుతాయని తెలిపింది. కానీ.. బడ్జెట్​ ఇన్​ బ్రీఫ్​లో ఇది రూ.3.22 లక్షల కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ఈ లెక్కన​ అప్పుల లెక్కల్లోనూ ఆర్థిక శాఖ జిమ్మిక్కులు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలైందని రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని.. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేసింది. కార్పొరేషన్ల పేరిట తీసుకునే గ్యారంటీలపై ఆంక్షలు విధించింది. అందుకే అప్పులపైన ప్రభుత్వం తప్పుడు లెక్కలు ఇచ్చిందా అనే సందేహాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.  వాస్తవానికి అప్పులు గ్రాస్​ స్టేట్​ డొమెస్టిక్​ప్రొడక్ట్​(జీఎస్​డీపీ)లో 25 శాతంలోపే ఉండాలి. అప్పుడే ఆర్థిక నిర్వహణ సరిగ్గా ఉందని గుర్తిస్తారు. అందుకే అప్పులు 23.8 శాతం ఉన్నట్లు ప్రభుత్వం కొత్త బడ్జెట్​ పుస్తకాల్లో పేర్కొంది. కానీ బడ్జెట్​ బయట తీసుకున్న రూ.1.35 లక్షల కోట్ల గ్యారంటీ అప్పులు, లెక్కల్లోకి రాకుండా దాచిన రూ.30 వేల కోట్ల అప్పు కలిపితే.. ఈ అప్పులు 29 శాతానికి చేరుతాయి.

అప్పుల కిస్తీలు, వడ్డీలకు రూ.35,113 కోట్లు

గత అప్పులకు సంబంధించిన కిస్తీలు, వాటిపైన వడ్డీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో చెల్లించనుంది.  రూ.35,113 కోట్లు  బడ్జెట్​లో వాటి కోసం ప్రతిపాదించింది. ఇందులో ప్రతినెలా వడ్డీలు కట్టడంతో పాటు ఇన్​స్టాల్మెంట్​ సొమ్మునూ కట్టాల్సి ఉంటుంది. వడ్డీల కోసం ఏకంగా ప్రతి నెలా  రూ.22,407  కోట్లు కట్టాల్సి ఉంది. పబ్లిక్ డెట్ రీపేమేంట్(అప్పుల చెల్లింపులు)  కింద రూ.12,706 కోట్లు  చెల్లిస్తారు. ఇలా ప్రతినెలా కిస్తీలు, వడ్డీల చెల్లింపుల కిందనే దాదాపు రూ.3 వేల కోట్లు కట్టాల్సి ఉంది.