
- కట్ చేసి లాకర్లు తెరిచిన దేవాదాయ అధికారులు
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆభరణాల బ్యాంక్ లాకర్ల తాళాలు మాయం కాగా.. నాలుగేండ్లుగా లాకర్లు తెరవకపోవడంతో దేవుడి నగలు భద్రమేనా..? అనే అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం హనుమకొండలోని యూనియన్ బ్యాంక్ లో మూడు లాకర్లు, ఆలయ ఆవరణలోని లాకర్ ను దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో పగలగొట్టారు. అందులోని నగలను ఆలయ ఈవో గదిలో భద్రపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. 2019లో అప్పటి ఈవో సులోచన బదిలీపై వెళ్లేటప్పుడు దేవుడి నగల రికార్డులు ఇవ్వలేదు. ఆమె తర్వాత రజనీ కుమారి, వెంకన్న, మారుతీ ఈవోలుగా రాగా.. ప్రస్తుతం కిషన్ రావు ఉన్నారు. సులోచన ఉన్నప్పటి నుంచే లాకర్ల తాళాలు కనిపించడం లేదు.
దీంతో దేవుడి ఆభరణాల లెక్క తెలియకుండా పోయింది. అయితే.. నగలు మాయమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవుడి కళ్యాణం, మిగతా ఉత్సవాలప్పుడు కూడా నగలపై చర్చ జరిగేది. దీంతో పరిస్థితిపై ప్రస్తుత ఈవో కిషన్ రావు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, ఎండోమెంట్ జువెలరీ ఆఫీసర్ అంజనీదేవి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అనిల్ శుక్రవారం వచ్చి ఆలయ లాకర్లు, నగలపై ఆరా తీశారు. తాళాలు లేకపోవడంతో బ్యాంక్ లోని మూడు లాకర్లు, టెంపుల్ లోని ఒక లాకర్ ను గ్యాస్ కట్టర్ తో పగులగొట్టి ఓపెన్ చేశారు. లాకర్లలోని బంగారం, వెండి ఇతర లోహాల లెక్కలను శనివారం విచారణ చేసి తెలుస్తామని చెప్పారు. ఆ తర్వాతే దేవుడి నగలపై క్లారిటీ రానుంది.