మెదక్‌‌ జిల్లాలో వేధిస్తుండని కొడుకును చంపిన తండ్రి

మెదక్‌‌ జిల్లాలో వేధిస్తుండని కొడుకును చంపిన తండ్రి
  • కమలాపూర్ లో రెండు రోజుల కింద యువకుడి  హత్య

పెద్దశంకరంపేట, వెలుగు : మెదక్‌‌ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్‌‌ గురువారం జరిగిన సుధాకర్‌‌ హత్య కేసులో నిందితుడిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. మద్యానికి బానిసై వేధిస్తుండడంతో సుధాకర్‌‌ను తండ్రే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్సై ప్రవీణ్‌‌రెడ్డి వెల్లడించారు. సుధాకర్‌‌ భార్య రెండేండ్ల కింద చనిపోగా... పోలియో వ్యాధి కారణంగా లేవలేని స్థితిలో ఉన్న కొడుకు, మూడేండ్ల కూతురుతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.

 ఆటో నడుపుతూ జీవించే సుధాకర్‌‌ భార్య చనిపోయినప్పటి నుంచి మద్యానికి బానిసగా మారి తరచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి సుధాకర్‌‌ మద్యం సేవించి రూ. 3 వేలు కావాలంటూ తండ్రి నర్సింలుతో గొడవ పడి, పైసలు ఇవ్వకుంటే తెల్లారే వరకు చంపేస్తానని బెదిరించాడు. దీంతో కొడుకుతో ఎప్పటికైనా తనకు ప్రాణానికి హాని ఉందని, అతడిని చంపితేనే కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని నర్సింలు భావించాడు. 

తర్వాత ఇంట్లో ఉన్న రోకలితో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తండ్రి నర్సింలుపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.