ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ను​.. సర్కారు పాటిస్తోందా?

ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ను​.. సర్కారు పాటిస్తోందా?
  • రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యపై గందరగోళం
  • డైరెక్ట్​ కాంటాక్ట్స్​లో అందరికీ టెస్ట్​ చేయాలన్న ఐసీఎంఆర్
  • వీలైనంత ఎక్కువ మందిని పరీక్షించాలంటూ సూచనలు
  • లక్షణాలు ఉన్నవాళ్లకే చేయిస్తున్న రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో కరోనా టెస్టుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తుండటంపై డాక్టర్ల నుంచి హైకోర్టు వరకు విస్మయం వ్యక్తమవుతోంది. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయకపోవడంతోనే కేసుల నమోదు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చాలా రాష్ట్రాలు రోజూ వేల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే.. మన రాష్ట్రంలో ఇరవై రోజులుగా రోజూ రెండు, మూడు వందల టెస్టులు కూడా చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు మాత్రం ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​ మెడికల్  రీసెర్చ్‌‌(ఐసీఎంఆర్‌‌‌‌)’ గైడ్‌‌లైన్స్ మేరకే టెస్టులు చేస్తున్నామని అంటోంది. ప్రైమరీ కాంటాక్ట్స్​ అయినా.. వైరస్​ లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తున్నామని చెబుతోంది. కానీ పాజిటివ్​ వాళ్లతో డైరెక్ట్​గా కాంటాక్ట్​ అయిన ఫ్యామిలీ, సన్నిహితులకు వైరస్​ లక్షణాలు లేకున్నా టెస్టులు చేయాలని గైడ్​లైన్స్​లో ఐసీఎంఆర్​ స్పష్టంగా పేర్కొంది. వారికి నెగెటివ్​ వచ్చినా కూడా కొద్దిరోజుల తర్వాత మళ్లీ టెస్టులు చేయాలని సూచించింది. మొత్తంగా కాంటాక్ట్స్​లో వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేయించాలని కేంద్రం స్పష్టం చేసింది. .

లక్షణాలు లేకున్నా చేయాలన్న ఐసీఎంఆర్‌‌

  • దేశంలో కరోనా టెస్టులకు సంబంధించి ఐసీఎంఆర్​ మొదట్లోనే గైడ్​లైన్స్​ విడుదల చేసింది. ఎవరెవరికి, ఎలాంటి పరిస్థితుల్లో టెస్టులు చేయాలని స్పష్టంగా పేర్కొంది.
  • గడిచిన 14 రోజుల్లో ఇంటర్నేషనల్‌‌  ట్రావెల్  చేసి ఉన్నవాళ్లు, వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లందరికీ కరోనా టెస్టులు చేయాలి.
  • పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్స్‌‌లో లక్షణాలు ఉన్నవారందరికీ టెస్టులు చేయాలి. డైరెక్ట్‌‌ అండ్  హైరిస్క్‌‌ కాంటాక్ట్ వ్యక్తులకు వైరస్ లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయించాలి. పాజిటివ్‌‌  వచ్చిన వ్యక్తిని కలిసిన ఐదో రోజు, ఆ తర్వాత వారికి టెస్టులు చేయాలి, నెగిటివ్ వస్తే 14వ రోజున మరోసారి టెస్ట్‌‌ చేయించాలి.
  • డాక్టర్లు, నర్సులు సహా లక్షణాలున్న హెల్త్‌‌ వర్కర్లు, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఇతర పేషెంట్లు అందరికీ టెస్టులు చేయించాలి.   హాట్‌‌స్పాట్లు/ క్లస్టర్లు, వలస కార్మికుల క్యాంపులు, నిర్వాసితుల క్యాంపుల్లో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం (ఇన్‌‌ఫ్లుయెంజా, ఐఎల్‌‌ఐ) వంటి లక్షణాలు ఉన్నవాళ్లందరికీ టెస్ట్ చేయించాలి. లక్షణాలు మొదలైన ఏడు రోజుల లోపు అయితే ఆర్టీపీసీఆర్ మెథడ్‌‌లో, ఏడు రోజులు దాటితే యాంటీ బాడీ మెథడ్‌‌లో టెస్ట్ చేయొచ్చు. యాంటీ బాడీ టెస్టులో నెగిటివ్ వస్తే, ఆర్టీపీసీఆర్ మెథడ్‌‌లో టెస్ట్‌‌ చేయించాలి.

రాష్ట్రంలో మాత్రం ఇట్లా..

ఏప్రిల్ రెండో వారం వరకు రాష్ట్ర సర్కారు ఎక్కువగానే టెస్టులు చేయించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే.. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఎలాంటి లక్షణాలు లేకున్నా టెస్టులు చేయించారు. మర్కజ్  వెళ్లొచ్చిన వారి విషయంలోనూ లక్షణాలతో సంబంధం లేకుండా పరీక్షలు చేశారు. ఏప్రిల్ 20  వరకూ ఇలాగే కొనసాగింది. ప్రైమరీ కాంటాక్ట్స్‌‌కూ టెస్టులు చేస్తుండడంతో సూర్యాపేట, వికారాబాద్  సహా పలు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తర్వాత టెస్టింగ్ స్ట్రాటజీని మార్చేశారు.

సెకండరీ కాంటాక్ట్స్‌‌లో వైరస్​ లక్షణాలు లేనివారికి టెస్టులు చేయొద్దంటూ ఏప్రిల్ 21న చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని కేవలం హోం క్వారంటైన్‌‌ చేయాలన్నారు. ఇక ప్రైమరీ కాంటాక్ట్స్‌‌లోనూ సింప్టమ్స్ ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాలంటూ అదే రోజున జిల్లాల హెల్త్​ అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు నుంచి టెస్టుల సంఖ్య తగ్గిపోయింది. పాజిటివ్  వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్‌‌లో లక్షణాలున్న వాళ్లకే టెస్టులు చేయడం మొదలుపెట్టారు. మంత్రి ఈటల కూడా రెండ్రోజుల క్రితం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాజిటివ్  వ్యక్తుల కుటుంబసభ్యుల్లోనూ అందరికీ టెస్టులు చేయించడం లేదని.. సింప్టమ్స్  ఉన్నవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మాత్రమే చేయిస్తున్నామన్నారు.

కరోనా లక్షణాలతో చనిపోయినా టెస్టుల్లేవ్‌‌..

కరోనా లక్షణాలతో చనిపోయిన వారికి టెస్టులు చేసే అంశం ఐసీఎంఆర్  గైడ్‌‌ లైన్స్‌‌లో  లేదు. వాస్తవానికి అలా టెస్టులు చేస్తే వైరస్​ సోకిందీ, లేనిదీ తేలుతుంది. వారి ఫ్యామిలీకి సోకి ఉండే చాన్స్​ కూడా బయటపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారికి టెస్టులు చేయొద్దని నిర్ణయించింది. డెడ్‌‌ బాడీస్  నుంచి శాంపిల్స్ సేకరించొద్దంటూ ఏప్రిల్ 20న పబ్లిక్ హెల్త్  డైరెక్టర్‌‌‌‌ సర్క్యులర్ జారీ చేశారు. కరోనా లక్షణాలతో చనిపోయిన కొందరికి టెస్టులు చేసినప్పుడు పాజిటివ్  రిజల్ట్​ వచ్చింది. రాష్ట్రంలో నమోదైన తొలి కరోనా మరణం విషయంలోనూ ఇదే జరిగింది. ఖైరతాబాద్‌‌లో ఉన్న ఓ హాస్పిటల్‌‌లో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మృతి చెందారు. డాక్టర్లు అనుమానంతో శాంపిల్‌‌ తీసి టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. తర్వాత ఆయన ఫ్యామిలీలో చాలా మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ, మంచిర్యాలలో ఓ మహిళ, ఓల్డ్‌‌ సిటీలోని తలాబ్‌‌ కట్టలోని ఒక మహిళ విషయంలోనూ ఇలాగే జరిగింది.