- ఆఫీసర్లు, పార్టీలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ కు గజం స్థలం వంద రూపాయలకే ఇచ్చేలా జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గతంలో పార్టీలకు భూమిని లీజుకు ఇచ్చేందుకు ఇచ్చిన జీవో 167కు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జున్‌లో జీవో 66 ఇచ్చిందని పిటిషనర్ టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం తరఫున లాయర్ వాదించారు. 1987 నాటి 167 జీవోలో ఎకరానికి మించకుండా భూమిని 30 ఏండ్లకు లీజుకు ఇచ్చేందుకు మాత్రమే వీలుందని, ఇప్పుడు ఇచ్చిన జీవో 66 ద్వారా టీఆర్ఎస్ కు 24 జిల్లాల్లో గజం స్థలం వంద రూపాయలకు ఇచ్చేందుకు వీలు కలిగిందన్నారు. ఈ తరహాలో భూమి ఇస్తే ఖజానాకు నష్టమేనని, ప్రజావసరాల కోసం సర్కార్ స్థలాల్ని వినియోగించాలన్న లక్ష్యం నీరుగారుతుందన్నారు. పార్టీల అవసరం కోసం భూమి ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట ఉల్లంఘన కూడా అవుతుందని చెప్పారు. అధికార పార్టీ ఇష్టానుసారంగా భూముల్ని రాజకీయ అవసరాల కోసం ఇచ్చుకుంటూపోతే.. ల్యాండ్ బ్యాంక్ ఖాళీ అవుతుందని వాదించారు. రెండు జీవోలు 167, 67 లను రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల డివిజన్ బెంచ్ ప్రతివాదులైన సీఎస్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూపరిపాలన చీఫ్ కమిషనర్‌లతోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, మజ్లిస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలకు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణను వాయిదా వేసింది.