
- కోర్టు ఆదేశించినా పట్టించుకోని రాష్ట్ర సర్కార్
- మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏఐటీయూసీ
- ఉత్పత్తి మాసాలంటూ తప్పించుకునే ప్రయత్నాల్లో యాజమాన్యం
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణలో సర్కారు తీవ్ర జాప్యం చేస్తోంది. ఎన్నికలు నిర్వహించాలంటూ గత నెలలో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి 25 రోజులు దాటినా సింగరేణి సంస్థ స్పందించడం లేదు. సింగరేణి ఎన్నికల్లో అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు వ్యతిరేకత ఎదురైతే రాబోయే జనరల్ఎలక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుందనే టీఆర్ఎస్ సర్కార్ఎన్నికల జోలికి వెళ్లడం లేదని ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మందమర్రి, వెలుగు: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఐదేళ్లు గడిచిపోయాయి. 2017 అక్టోబర్5న ఎన్నికలు నిర్వహించగా గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్ గెలిచింది. ఆరు నెలల తర్వాత కేంద్ర కార్మికశాఖ 2018 ఏప్రిల్‌లో రెండేళ్ల కాలపరిమితితో టీబీజీకేఎస్‌కు అధికారిక పత్రాలను జారీ చేసింది. ఎన్నికల ముందు నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారని, అప్పటివరకు కొనసాగుతామంటూ ఆ యూనియన్కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం రాకపోయినా 2021 అక్టోబర్‌నాటికి నాలుగేళ్ల కాలపరిమితి కూడా ముగిసింది. ఆరు నెలలు ఆలస్యంగా గుర్తింపు పత్రం ఇచ్చారంటూ టీబీజీకేఎస్అభ్యంతరం వ్యక్తం చేసింది. 2022 ఏప్రిల్ తో ఆరు నెలలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదు.
పోరాటలు చేసి.. కోర్టును ఆశ్రయించినా..
సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి ఏడాది గడిచిపోయింది. అయినా మళ్లీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర కార్మికశాఖ కమిషనర్‌తో పాటు బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసి సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేలా ఒత్తిడి తేవాలని కోరాయి. ఎలాంటి స్పందన రాకపోవడంతో సెంట్రల్లేబర్డిప్యూటీ కమిషనర్‌ను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తూ సింగరేణికి డీఎల్సీ లెటర్‌రాశారు. దీనిపై స్పందించిన యాజమాన్యం ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లెటర్ రాసింది. కానీ ఇప్పటివరకు సర్కారునుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు గుర్తింపు సంఘాన్ని ఆహ్వానించకూడదని, ప్రస్తుతం అన్ని సంఘాలు సమానమేనని జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిపై ఒత్తిడి పెంచుతూ ఎన్నికల కోసం పోరాటాలు చేస్తున్నాయి. ఇటీవల సింగరేణిలో నిర్వహించిన సమ్మె సందర్భంగా ఆర్ఎల్ సీ వద్ద టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై చర్చించారు. కార్మిక సమస్యలపై చర్చించేందుకు తమను కూడా ఆహ్వానించాలని డిమాండ్‌చేశారు. ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ ఉప కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ ఆగస్టు 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతనెల 28న సింగరేణికి హైకోర్టు ఇంటీరియం ఆర్డర్జారీ చేసింది. సింగరేణిలో మూడు నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. మునుగోడు బైఎలక్షన్తర్వాత సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు రాష్ట్ర సర్కార్చొరవచూపే చాన్స్ఉందని ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మికశాఖ సైతం ఇటీవల సింగరేణికి లెటర్ రాసింది. ఎన్lఇకల విషయమై సింగరేణి సీఎండీ రాష్ట్ర సర్కారుకు లెటర్ రాసినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మరింత జాప్యం తప్పదా?
ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తికి డిసెంబర్నుంచి చివరి నాలుగు నెలలు కీలకం. ఈ ఉత్పత్తి మాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపే పరిస్థితులు ఉండకపోవచ్చని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్‌వరకు సింగరేణి ఎన్నికల కోసం ఎదురుచూడాల్సిందే. మరోవైపు గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించి తమ పట్టు నిలుపుకోవాలని అన్ని కార్మిక సంఘాలు భావిస్తూ, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు కేంద్ర కార్మికశాఖ నిర్వహించాల్సి ఉంది. దీంతో ఆర్ఎల్సీ, డీఆర్ఎల్సీలకు హైకోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయించడం ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు చాన్స్ఉంటుందని భావించిన ఏఐటీయూసీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు డైరెక్షన్అనుసరించి సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేస్తున్నారు.