ఇంగ్లీస్ మాట్లాడిన రైతుపై సీఎం ఫైర్

ఇంగ్లీస్ మాట్లాడిన రైతుపై సీఎం ఫైర్

రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమంలో ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఓ రైతుపై సీఎం నితీష్ కుమార్ ఫైరయ్యారు. ఇదేమైనా ఇంగ్లండ్ అనుకున్నావా అంటూ అతనిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాట్నాలోని బాపు సభాగర్‌ ఆడిటోరియంలో మంగళవారం ‘నాలుగో వ్యవసాయం రోడ్‌మ్యాప్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం నితీష్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లఖిసరాయ్‌కు చెందిన వ్యవసాయ పారిశ్రామికవేత్త అమిత్‌ కుమార్‌ సీఎం నితీశ్‌ను ప్రశంసిస్తూ మాట్లాడటం ప్రారంభించారు. అతను మాట్లాడిన కొద్దిసేపటికే సీఎం అతన్ని ప్రసంగాన్ని  అడ్డుకున్నారు. దీనికి కారణం అతను తన ప్రసంగంలో ఎక్కువగా ఇంగ్లీష్ లో ఉండటమే.

మిమ్మల్ని సలహాలు ఇవ్వడానికి ఇక్కడికి ఆహ్వానించారు. కానీ మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఇదేమన్నా ఇంగ్లాండా?  అని అతనిపై సీఎం మండిపడ్డారు. మీరు బిహార్‌లో పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్‌ స్కీమ్స్‌ అనే బదులు సర్కారీ యోజన అనలేరా. రోజూవారీ కార్యకలాపాలకు మాతృ భాషను ఉపయోగించాలని, ఇంగ్లీష్‌ను చదువు కోసమే ఉపయోగించాలని  సీఎం అతనికి సూచించారు.  దీంతో అప్పటివరకు ఇంగ్లీష్‌లో మాట్లాడిన అతను ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నిన్న మాతృ భాష దినోత్సవం అని తెలిసిందే. అదే రోజున మాతృభాషపై సీఎం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధన్యతను సంతరించుకుంది.