దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి ఎన్నేళ్లు?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి ఎన్నేళ్లు?

‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంకోవారం రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. అయితే ఈ రోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్య్ర దినోత్సవం 75వదా లేక 76వదా అనే సందేహం దేశ ప్రజల్లో నెలకొంది. మెజారిటీ ప్రజలు ఇది 76వ స్వాతంత్య్రం దినోత్సవమని అంటున్నప్పటికీ... కొంత మంది మాత్రం కాదు కాదు ఇది 75వ దినోత్సవమని అంటున్నారు. ఇలా కొందరేమో 76... మరికొందరూ 75వ స్వాతంత్య్ర దినోత్సవమని వాదిస్తున్నారు. అసలు ఎందుకీ కన్ఫ్యూజన్?

కొంతమంది ఇవాళ (2022, ఆగస్టు 15)  76 వ స్వాతంత్య్ర దినోత్సవం అని అంటున్నారు. వాళ్లు అలా అనడంలో ఏమాత్రం అబద్ధంలేదు. ఎందుకంటే 1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కాబట్టి ఆ రోజునే దేశ స్వాతంత్య్ర మొదటి దినోత్సవంగా పరిగణించాలి. ఆ లెక్కన చూసుకుంటే ఇవాళ మనం జరుపుకుంటున్నది 76వ స్వాతంత్య్ర దినోత్సవం. 

కానీ... ఇంకొంతమంది ఇవాళ 75వ స్వాతంత్య్ర దినోత్సవమని అంటున్నారు. అయితే వాళ్లు అలా అనడానికి కారణం లేకపోలేదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా... 1948, ఆగస్టు 15తో స్వాతంత్య్రం వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఆ రకంగా చూసుకుంటే ఆ రోజే దేశ స్వాతంత్య్రానికి మొదటి వార్షికోత్సవం.  ఈ రకంగా చూసుకుంటే 2022, ఆగస్టు 15న మనం జరుపుకుంటున్నది 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం. అంతే గానీ 75వ దినోత్సవం కాదు.

కాబట్టి మనం ఇవాళ జరుపుకుంటున్నది 76వ స్వాతంత్య్ర దినోత్సవం. కానీ.. సంవత్సరాల ప్రకారం చూసుకుంటే మాత్రం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం.