
- అసెంబ్లీకి రావాలన్న సీఎం రేవంత్
- హరీశ్ వస్తారంటున్న బీఆర్ఎస్ నేతలు
- ఇప్పటికీ అసెంబ్లీకి కేసీఆర్ వచ్చింది రెండు సార్లే
- కీలక సమయంలోనూ కానరాని గులాబీ బాస్
- బనకచర్లపై నోరెత్తని మాజీ ముఖ్యమంత్రి
హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. సబ్బండ వర్ణాలు ఒక్కటై పోరాడి తెలంగాణను సాధించుకున్నాయి. అయితే తెలంగాణ కోసం చావునోట్లో తలకాయ పెట్టానంటున్న కేసీఆర్ కీలక సమయంలో ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఆయన చేసుకున్న ఒప్పందాల కారణంగానే తెలంగాణ తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పదే పదే చెబుతున్నారు. ఇటీవల జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో కూడా కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేయడం వల్లే రాష్ట్రం ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోగా బీఆర్ఎస్ డిఫరెంట్ రియక్ట్ అయ్యింది. చర్చకు హరీశ్ వస్తారంటూ మాజీ మంత్రులు తెలుపడం గమనార్హం.
ALSO READ | గుడ్ న్యూస్: హైదరాబాద్ లో మరో నాలుగు స్కైవాక్లు.. ఏ ఏరియాల్లో అంటే..
అంటే కేసీఆర్ రారని చెప్పకనే చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు మంటగలుస్తుంటే సర్కారుకు అండగా నిలవాల్సిన కేసీఆర్ ఫాంహౌస్ కు పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు గోదావరి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు జరిగాయి..? తన ప్రమేయం ఎంత అనేది వివరణ ఇవ్వాల్సిన ఆయన అసెంబ్లీకి రారని బీఆర్ఎస్ నేతలు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు ఏం జరిగింది..? సంతకాలు చేశారా.? ఎంతకు అగ్రిమెంట్ చేసుకున్నారు. వీటన్నింటిపై కుండ బద్దలు కొట్టాల్సిన ఆయన ముఖం చాటేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.