IND VS ENG 2025: గిల్ ట్రిపుల్ సెంచరీ మిస్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ ఎంతంటే..?

IND VS ENG 2025: గిల్ ట్రిపుల్ సెంచరీ మిస్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ ఎంతంటే..?

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆతిధ్య జట్టుపై ఆధిపత్యం చూపిస్తూ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. గిల్ (387 బంతుల్లో 269: 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. జైశ్వాల్ (87), జడేజా (87) హాఫ్ సెంచరీలు చేయగా.. సుందర్ 42 పరుగులతో రాణించాడు. చివరి మూడు వికెట్లను భారత్ 13 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో భారత్ 600 పరుగుల మార్క్ చేరుకోలేకపోయింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్, బషీర్, వోక్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కార్స్, స్టోక్స్, రూట్ తలో వికెట్ తీసుకున్నారు. 7 వికెట్ల నష్టానికి 564 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన టీమిండియా మరో 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. డబుల్ సెంచరీ చేసి ఊపు మీదున్న గిల్ 269 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. దీంతో గిల్ మారథాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ వెంటనే ఆకాష్ దీప్ భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. చివరి వికెట్ గా సిరాజ్ వెనుదిరిగాడు. 

ALSO READ | IND VS ENG 2025: గిల్ రికార్డ్ డబుల్ సెంచరీ.. కెప్టెన్‌గా కోహ్లీని వెనక్కి నెట్టిన యువ సారధి

5 వికెట్ల నష్టానికి 310 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్ లో జాగ్రత్తగా ఆడింది. గిల్, జడేజా ఎలాంటి అనవసర షాట్స్ జోలికి పోకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జడేజా తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరోవైపు తొలి రోజు సెంచరీ హీరో గిల్ 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 

వీరిద్దరూ పట్టుదలగా.. ఓపిగ్గా బ్యాటింగ్ చేయడంతో భారత్ తొలి సెషన్ లో ఆధిపత్యం చూపించింది.  ఆరో వికెట్ కు 203 పరుగుల భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు ఇంగ్లాండ్ కు వీరి జోడీని విడగొట్టింది. జోష్ టంగ్ బౌలింగ్ లో జడేజా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 89 పరుగులు చేసిన జడేజా తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత సుందర్ తో కలిసి గిల్ మరో వికెట్ పడకుండా సెషన్ ముగించాడు.     

6 వికెట్ల నష్టానికి 419 పరుగులతో రెండో లంచ్ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన భారత్ వేగంగా పరుగులు రాబట్టింది. ఒక ఎండ్ లో సుందర్ నిదానంగా ఆడినా మరో ఎండ్ లో గిల్ బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు శరవేగంగా ముందుకు కదిలింది. టంగ్ వేసిన 118 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 10 పరుగులు రాబట్టిన గిల్..198 పరుగులకు చేరుకున్నాడు. గిల్ 199 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుందర్ కొన్ని బౌండరీలతో అలరించాడు. టంగ్ బౌలింగ్ లో వరుసగా 4, 6 కొట్టి గిల్ పై ఒత్తిడి తగ్గించాడు. టంగ్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ లో సింగిల్ తీసి గిల్ 200 డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

డబుల్ సెంచరీ తర్వాత గిల్ జోరు పెంచాడు. వరుస బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. చూస్తూ ఉండగానే 250 పరుగుల మార్క్ చేరుకున్నాడు. మరో ఎండ్ లో సుందర్ గిల్ కు చక్కని సహకారం అందించాడు. 42 పరుగుల వద్ద బ్యాటింగ్ చేసి రూట్ బౌలింగ్ లో సుందర్ బౌల్డయ్యాడు. దీంతో గిల్, సుందర్ మధ్య 144 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. రెండో సెషన్ లో ఇండియా 145 పరుగులు జోడించి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.