
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే అసాధారణంగా ఆడుతున్నాడు. సాధారణంగా కెప్టెన్సీ ఉంటే బ్యాటింగ్ లో రాణించడం కష్టం. కానీ గిల్ మాత్రం ఇందుకు భిన్నం. సారధ్య బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల సిరీస్ లో వరుస టెస్టుల్లో సెంచరీల మోత మోగించాడు. లీడ్స్ టెస్టులో 147 పరుగులు చేసిన గిల్. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా 269 పరుగులు చేశాడు. ఈ డబుల్ సెంచరీతో ఈ టీమిండియా యువ సారధి.. కోహ్లీ రెండు రికార్డ్స్ బ్రేక్ చేశాడు.
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్ గా నిలిచాడు. 2019లో సౌతాఫ్రికాపై కోహ్లీ కెప్టెన్ గా 254 పరుగులు చేశాడు. ఈ రికార్డ్ ను గిల్ ఇంగ్లాండ్ పై ఎడ్జ్ బాస్టన్ లో 269 పరుగులతో బద్దలు కొట్టాడు. విదేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2016 లో వెస్టిండీస్ పై కోహ్లీ 200 పరుగులు చేశాడు. ఈ రికార్డును కూడా గిల్ బ్రేక్ చేయడం విశేషం. సెహ్వాగ్, ద్రవిడ్ తర్వాత విదేశాల్లో టెస్టుల్లో 250 పైగా వ్యక్తిగత స్కోర్ చేసిన మూడో బ్యాటర్ గా గిల్ అరుదైన లిస్టులోకి చేరిపోయాడు.
ఈ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్‌లో గిల్ యావరేజ్ కేవలం 14.66 మాత్రమే ఉంది. దీంతో గిల్ పై చాలా విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ లో చెత్త రికార్డ్స్ ఉన్నవాడికి టెస్ట్ కెప్టెన్సీ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. అయితే గిల్ తన కెప్టెన్సీకి న్యాయం చేశాడు. బ్యాటింగ్ లో జట్టును ముందుండి నడిపించాడు. గిల్ (387 బంతుల్లో 269: 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.