IND VS ENG 2025: ఎడ్జ్ బాస్టన్‌లో రికార్డుల మోత: ట్రిపుల్ సెంచరీకి చేరువలో గిల్.. 600 పరుగుల దిశగా టీమిండియా

IND VS ENG 2025: ఎడ్జ్ బాస్టన్‌లో రికార్డుల మోత: ట్రిపుల్ సెంచరీకి చేరువలో గిల్.. 600 పరుగుల దిశగా టీమిండియా

ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియాకు తిరుగు లేకుండా పోతుంది. 400 పరుగులు కష్టమనుకుంటే ఇప్పుడు ఏకంగా 600 పరుగులు దిశగా టీమిండియా దూసుకెళ్తుంది. భారత యువ సారధి గిల్ నెక్స్ట్ లెవల్లో బ్యాటింగ్ చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన గిల్.. ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రెండో రోజు టీ విరామ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (265), ఆకాష్ దీప్ (0) ఉన్నారు. 

ALSO READ | IND VS ENG 2025: అసలు సిసలు కెప్టెన్సీ ఇన్నింగ్స్ అంటే ఇది: ఎడ్జ్ బాస్టన్ టెస్టులో గిల్ డబుల్ సెంచరీ

6 వికెట్ల నష్టానికి 419 పరుగులతో రెండో లంచ్ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన భారత్ వేగంగా పరుగులు రాబట్టింది. ఒక ఎండ్ లో సుందర్ నిదానంగా ఆడినా మరో ఎండ్ లో గిల్ బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు శరవేగంగా ముందుకు కదిలింది. టంగ్ వేసిన 118 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 10 పరుగులు రాబట్టిన గిల్..198 పరుగులకు చేరుకున్నాడు. గిల్ 199 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుందర్ కొన్ని బౌండరీలతో అలరించాడు. టంగ్ బౌలింగ్ లో వరుసగా 4, 6 కొట్టి గిల్ పై ఒత్తిడి తగ్గించాడు. టంగ్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ లో సింగిల్ తీసి గిల్ 200 డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

డబుల్ సెంచరీ తర్వాత గిల్ జోరు పెంచాడు. వరుస బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. చూస్తూ ఉండగానే 250 పరుగుల మార్క్ చేరుకున్నాడు. మరో ఎండ్ లో సుందర్ గిల్ కు చక్కని సహకారం అందించాడు. 42 పరుగుల వద్ద బ్యాటింగ్ చేసి రూట్ బౌలింగ్ లో సుందర్ బౌల్డయ్యాడు. దీంతో గిల్, సుందర్ మధ్య 144 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. రెండో సెషన్ లో ఇండియా 145 పరుగులు జోడించి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.