మొబైల్స్‌లోకి ‘పెగాసస్’ స్పైవేర్.. ఎలా తప్పించుకోవాలంటే?

 మొబైల్స్‌లోకి ‘పెగాసస్’ స్పైవేర్.. ఎలా తప్పించుకోవాలంటే?

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ కంపెనీ మరోమారు వార్తల్లో నిలిచింది. 2019లో ఈ స్పైవేర్ గురించి భారత్‌లో బాగానే చర్చ జరిగింది. ఆ ఏడాది మన దేశంలో చాలా మంది వాట్సాప్ యూజర్లకు పెగాసస్ తమ ఫోన్లను హ్యాక్ చేసిందంటూ మెసేజులు వచ్చాయి. ఇప్పుడు దేశంలోని పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలతోపాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసిందనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీరి ఫోన్ల ద్వారా మరికొంత మంది సాధారణ ప్రజల ఫోన్లను కూడా పెగాసస్ హ్యాక్ చేసిందని రిపోర్టులు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో పెగాసస్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

పెగాసస్ అంటే ఏంటి?
స్మార్ట్ ఫోన్‌లను హ్యాక్ చేసి, నిఘా పెట్టేందుకు వాడే స్పైవేర్ రకం సాఫ్ట్‌వేర్ ఇది. ఇజ్రాయెల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌వో దీనిని రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్పైవేర్‌లలో ఇది శక్తిమంతమైనది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు తెలియకుండా ఇది వారి ఫోన్లలోకి చేరిపోయి నిఘా పెడుతుంది. యూఆర్ఎల్‌లు పంపడం, మిస్డ్ కాల్స్, వాట్సాప్ వంటి యాప్‌ల ద్వారా  ఇది ఇతరుల ఫోన్​లలో ఇన్​స్టాల్ అవుతుంది.

ఈ స్పైవేర్‌తో ఫోన్‌పై ఎలాంటి ఎఫెక్ట్
హ్యాక్ అయిన ఫోన్ల నుంచి మెసేజ్​లు, మెయిల్స్, ఫోన్ కాల్స్, లొకేషన్ వంటి డేటానంతా ఈ స్పైవేర్‌ హ్యాకర్లకు పంపుతుంది. స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు. ఏయే బటన్స్ నొక్కారో తెలుసుకోవచ్చు. బ్రౌజర్ హిస్టరీ, డేటా మొత్తాన్నీ తీసుకోవచ్చు. ఎన్​క్రిప్టెడ్ చాట్స్, ఫైల్స్ కూడా చూడొచ్చు.

ఈ స్పైవేర్‌‌ను ఎలా తప్పించుకోవచ్చంటే..
ఈ స్పైవేర్ చాలా అధునాతనమైనది. అయితే చాలా కంపెనీలు ఉపయోగించే యాప్స్ మరియు ఫోన్ల యొక్క సెక్యూరిటీలు కూడా చాలా అధునాతంగా ఉంటున్నాయి. ఒకవేళ మీరు మీ ఫోన్లలో లెటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగిస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఎప్పటికప్పుడు మీ సోషల్ మీడియా ఖాతాల యొక్క పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉంటే ఈ స్పైవేర్ నుంచి తప్పించుకోవచ్చు. మీకు ఏదైనా అనుమానాస్పద మెసెజ్ లేదా లింక్ వస్తే.. అటువంటి వాటిపై క్లిక్ చేయకుండా ఉండటం మంచిది.