ఫోన్ రేడియేషన్ వల్ల మహిళల్లో మొటిమలు వస్తున్నాయా..?

 ఫోన్ రేడియేషన్ వల్ల మహిళల్లో మొటిమలు వస్తున్నాయా..?

కొందరికి అనుకోకుండా ఎలాంటి జంక్ ఫుడ్ లేదా బయటి ఫుడ్ తినకున్న మొటిమలు  వస్తుంటాయి. ఒకోసారి ఎంత మంచి డైట్ తీసుకున్న, మొటిమలు రాకుండా జాగ్రత్త పడ్డ  మొటిమలు  తగ్గడం కాదు కదా.. మొటిమలను తీవ్రం చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది మహిళల్లో చెంపలు, దవడ, గడ్డం మీద మొటిమలు తగ్గకుండా వేధిస్తున్నాయి. దీనికి ఒక ముఖ్య కారణం మనం ఎక్కువగా వాడే మొబైల్ ఫోన్ అని థానే  డెర్మటాలజిస్ట్ చెబుతున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు.

ఫోన్ వల్ల మొటిమలు ఎలా వస్తాయి అంటే మీ ఫోన్ హార్మోన్ల సమస్యను కలిగించకపోయినా, ఇప్పటికే ఉన్న మొటిమలను తీవ్రం చేస్తుంది. దానికి కారణాలు ఏంటంటే మనం ఫోన్‌ను డెస్క్‌లు, బ్యాగులు, జిమ్ పరికరాలపై ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాము. దీనివల్ల ఫోన్ స్క్రీన్‌పై బ్యాక్టీరియా, దుమ్ము, చెమట చేరుతుంది.

ఫోన్ మాట్లాడేటప్పుడు ముఖానికి మీ ఫోన్ ని గట్టిగా నొక్కి పట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా, చెమట, దుమ్ము లేదా మేకప్ చర్మ రంధ్రాల్లోకి వెళ్తాయి. ఎక్కువ సేపు మాట్లాడటం వల్ల ఫోన్ నుండి వచ్చే వేడి, చర్మంపై కలిగే రాపిడి వల్ల రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎర్రగా, నొప్పిగా మారతాయి. దీనినే వైద్య భాషలో 'యాక్నే మెకానికా' అంటారు.

 సాధారణంగా హార్మోన్ల ప్రభావం ముఖం కింది భాగంలో ఎక్కువగా ఉంటుంది. ఈ భాగంలో చర్మం చాలా సున్నితంగా ఉండి, చెమట గ్రంధుల నుండి ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి చోట ఫోన్ వల్ల కలిగే వేడి, బ్యాక్టీరియా తోడవ్వడంతో మొటిమలు అస్సలు తగ్గవు.
 
మొటిమలు తగ్గాలంటే మందులతో పాటు ఈ చిన్న అలవాట్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏదైనా కాల్స్ మాట్లాడేటప్పుడు ఫోన్‌ను ముఖానికి అంటించకుండా  లేదా నొక్కి పెట్టుకోకుండా ఇయర్‌ఫోన్స్ లేదా బ్లూటూత్ వాడండి. దీనివల్ల 90%  ముఖ చర్మ సమస్య తగ్గుతుంది. రోజుకు కనీసం రెండు సార్లు అయినా ఆల్కహాల్ వైప్స్‌తో లేదా మెత్తని బట్టతో ఫోన్ స్క్రీన్‌ను శుభ్రం చేయండి.

పదే పదే ముఖాన్ని చేతులతో తాకడం, దవడలు లేదా గడ్డం పట్టుకోవడం చేయకండి. వ్యాయామం లేదా జిమ్  చేసిన వెంటనే లేదా చర్మంపై చెమట ఉన్నప్పుడు ఫోన్‌ను ముఖానికి అంటించకండి. మీరు మీ  ఫోన్ ని పక్కన పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటే దిండు లేదా దిండు కవర్స్  ఎప్పటికప్పుడు మార్చండి.

మీ చర్మ సంరక్షణ కోసం సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ వాడండి. ఆయిల్-ఫ్రీ సన్‌స్క్రీన్ లేదా లైట్  మాయిశ్చరైజర్ ఉపయోగించండి. మొటిమలు మరీ ఎక్కువగా ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా డెర్మటాలజిస్ట్/చర్మవ్యాధి డాక్టర్ ని సంప్రదించండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోన్ వాడకం వల్ల హార్మోన్ల సమస్య రాదు, కానీ ఉన్న మొటిమలు తగ్గకుండా ఆపేస్తుంది. కాబట్టి, ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ చర్మం త్వరగా కోలుకుంటుంది.