భారత్ లో ఉగ్రదాడికి కుట్ర..రష్యా అదుపులో సూసైడ్ బాంబర్

భారత్ లో ఉగ్రదాడికి కుట్ర..రష్యా అదుపులో సూసైడ్ బాంబర్

భారత్లో ఉగ్రదాడి కుట్రను రష్యా భగ్నం చేసింది. దేశంలో ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఐఎస్ఐఎస్.. కేంద్ర సర్కారులోని ఓ కీలక నేతను  హత్య చేసేందుకు ఒక సూసైడ్ బాంబర్ను రంగంలోకి దింపింది. అయితే ఆ ఉగ్రవాదిని రష్యా అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ ‘స్పుత్నిక్’ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు ఒకరిని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అదుపులోకి తీసుకుంది. అతడు విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన వాడని.. సూసైడ్​ బాంబర్​ గా మారి భారత్ లో అధికార పార్టీలో ఉన్న ఓ రాజకీయ నేతను హతమార్చేందుకు ప్లాన్ చేశాడని ఎఫ్ఎస్బీ తెలిపింది. 

ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో దాడికి ప్లాన్ చేశానని ఆ ఉగ్రవాది తెలిపినట్లు ఎఫ్ఎస్బీ పేర్కొంది. ఆ సూసైడ్ బాంబర్ను టర్కీలో ఐఎస్ఐఎస్ రిక్రూట్ చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఐఎస్ఐఎస్ తోపాటు దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. ఈ సంస్థలను చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టంలోని మొదటి షెడ్యూల్ లో చేర్చింది. ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాలో తన భావజాల వ్యాప్తికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు సైబర్ యాక్టివిటీస్ పై గట్టి నిఘా పెట్టాయి.