ISPL 2024: గల్లీ క్రికెటర్ల కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి 24న వేలం

ISPL 2024: గల్లీ క్రికెటర్ల కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి 24న వేలం

మీరు గల్లీ క్రికెటరా..! టెన్నిస్ బాల్ క్రికెట్‌లో ఇరగదీస్తారా! అయితే మీకో చక్కని అవకాశం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనేది గల్లీ క్రికెటర్లే అయినా అంతా ఐపీఎల్ తరహాలోనే జరగనుంది. వేలం పాట.. అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌లు.. అధునాతన టెక్నాలజీ.. అబ్బురపరిచే కామెంటరీ ఇలా బోలెడన్నీ సంగతులు ఉన్నాయి. 

వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇదొక టీ10 ఫార్మాట్ లో జరగబోయే టెన్నిస్ బాల్ టోర్నమెంట్. ఇందులో ముంబైతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఈ ఆరు జట్లను ఆరు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్ లు కాగా, అన్నీ ముంబై వేదికగానే జరగనున్నాయి. 

ISPL 2024 వివరాలు

  • మొత్తం జట్లు: 6 (ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్)
  • మొత్తం మ్యాచ్ లు: 19
  • వేదిక: ముంబై


ఈ లీగ్ మార్చి 2 నుంచి 9 వరకూ వారం రోజుల పాటు జరగనుండగా.. ప్రతి జట్టులో గరిష్ఠంగా 16 మంది ఆటగాళ్లు, 6 సపోర్ట్ స్టాఫ్ ఉండనున్నారు. ఒక్కో ఫ్రాంఛైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం కోటి రూపాయల పరిమితి ఉంటుంది. వేలంలో ఒక్కో ప్లేయర్ కనీస ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఈ వేలం ఫిబ్రవరి 24న జరగనుంది. స్టేడియాల్లో ఆడాలని కలలు కనే ఎంతో మంది టెన్నిస్ బాల్ ప్లేయర్లకు ఈ లీగ్ చక్కని అవకాశం అని చెప్పుకోవాలి. మనకు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది అని నిరుత్సాహ పడకుండా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టండి.