ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం : గాజా ఖాళీ చేసిన 4 లక్షల మంది జనం

ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం : గాజా ఖాళీ చేసిన 4 లక్షల మంది జనం

ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది. అలాంటి ఊరును వదిలివెళ్లడమంటే ఆ బాధ వర్ణణాతీతం. ఇప్పుడు అలాంటి బాధతోనే  గాజాను వదిలివెళ్తున్నారు అక్కడి ప్రజలు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా గాజా ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి వలస వెళ్లిపోతున్నారు. గాజాను వదిలి వెళ్లిపోవాలంటూ అక్కడి పౌరులకు ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లో ఇండ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న గాజా ప్రజలు..చేసేదేమి లేక కన్నీరుపెట్టుకుంటూ తన ఇండ్లను ఖాళీ చేస్తున్నారు. 

అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్దం మొదలైంది. వారం రోజులుగా గాజాపై బుల్లెట్ల వర్షం కురుస్తోంది. వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్లో మరణించిన వారి సంఖ్య 1300 దాటింది. 1900 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 3200 మంది మృతి చెందారు. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి గాజా ప్రజలు మరో ప్రాంతాలకు వలసపోతున్నారు. 

అధికారిక లెక్కల ప్రకారం..ఇప్పటి వరకు గాజా పట్టణం నుంచి 4 లక్షల మంది వలస వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు 10 వేల మంది ప్రజలు గాజాలో దక్షిణం వైపునకు వెళ్లిపోయారు. ప్రజలు దక్షిణ గాజా వైపునకు వలస వెళ్లిపోతున్నారని తెలుసుకున్న  యుద్ధవిమానాలు..వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఈ  దాడుల్లో 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. 

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై మధ్య ప్రాచీన దేశాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జోర్దాన్, బహ్రెయిన్లలో వేలాది మంది గాజా ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ను ఈ యుద్ధాన్ని ఆపే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.