డబుల్ ధరకు వ్యాక్సిన్ కొని.. కరోనాను జయించిన ఇజ్రాయెల్

డబుల్ ధరకు వ్యాక్సిన్  కొని.. కరోనాను జయించిన ఇజ్రాయెల్
  • ఇజ్రాయెల్ ముందుచూపు
  • కరోనాకు టీకాతోనే గురిపెట్టిన్రు 
  • ప్రపంచం కంటే ముందే కరోనాను జయించిన్రు

జెరూసలెం: పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయించిన ఫస్ట్ దేశంగా ఇజ్రాయెల్ గతవారమే రికార్డ్ సృష్టించింది. ఇక ఎవరికీ మాస్కులు అవసరం లేదని ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలన్నీ నిర్భయంగా ఓపెన్ చేసేసింది. మరీ రద్దీగా ఉండే కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో తప్ప దేశమంతటా అన్ని ఆంక్షలనూ తొలగించింది. కోటి మంది జనాభా లేని ఒక చిన్న దేశం ఇంత త్వరగా ఇంత పెద్ద విజయం ఎలా సాధించింది? ఇందుకు విశ్లేషకులు చెప్తున్న ఒకే ఒక్క మాట.. తెలివిగా ఆలోచించే నాయకత్వమే!

బాగా చదువుకున్నోళ్లే లీడర్లు 
ఇజ్రాయెల్​లో లీడర్లలో సైన్స్, మెడిసిన్​లో అడ్వాన్స్డ్ డిగ్రీలు పొందినవారే ఎక్కువున్నారు. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎంఐటీలో క్లాస్ టాపర్. సైన్స్, మెడిసిన్ పట్ల బాగా అవగాహన ఉండడంతో కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే హెర్డ్ ఇమ్యూనిటీ ఒక్కటే మార్గమని, ఇందుకోసం ప్రజలందరికీ టీకాలు వేయాలని గత ఏడాదే నిర్ణయించుకున్నారు.

ఇట్ల ప్లాన్ చేసిన్రు.. 
అందరికీ వ్యాక్సినేషన్ అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అమెరికన్ కంపెనీలు ఫైజర్, మోడెర్నాపై ఇజ్రాయెల్ ఫోకస్ పెట్టింది. ఎంఐటీ, హార్వర్డ్​లో తనకున్న పరిచయాలతో ఆ కంపెనీల  సీఈవోలతో నెతన్యాహు వెంటనే  ఫ్రెండ్షిప్ మొదలుపెట్టారు.  వ్యాక్సిన్‌ ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి చేసినట్లు ఫైజర్ ప్రకటించిన వెంటనే నెతన్యాహు రంగంలోకి దిగి 80 లక్షల వ్యాక్సిన్లు ఇజ్రాయెల్‌కు  అమ్మేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫైజర్ ఒక డోసుకు 15 డాలర్లు అని రేటు పెడితే.. తాము 30 డాలర్లు ఇస్తామంటూ నెతన్యాహు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. తమ దేశంలో వ్యాక్సిన్ పనితనపు డేటాను కూడా ఇస్తామన్నారు. దీంతో 2020 నవంబర్ నాటికే ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్లు (ఇజ్రాయెల్ మొత్తం జనాభా 93 లక్షలు) ఇజ్రాయెల్‌కు చేరిపోయాయి.

రెట్టింపు ధర.. తెలివైన నిర్ణయమే  
ఎంత పోటీ ఉంటే మాత్రం రెట్టింపు ధరకు కొనడం ఏమంత తెలివైన నిర్ణయం? అన్న విమర్శకుల నోళ్లు.. నెతన్యాహు ఇచ్చిన సమాధానంతో టపీమని మూతపడ్డాయి. తన నిర్ణయం ‘క్లాసిక్ సెకండ్  ఆర్డర్ థింకింగ్’కు ఎగ్జాంపుల్ అని నెతన్యాహు చెప్పారు. లాక్ డౌన్ వల్ల దేశానికి జరిగే ఆర్థిక నష్టంతో పోలిస్తే ఇది అసలు లెక్కలోకే రాదన్నారు. ఫైజర్ కంపెనీకి 80 లక్షల డోసులకు అదనంగా ఇచ్చిన డబ్బు మొత్తం.. జస్ట్ మూడు రోజుల లాక్ డౌన్ నష్టానికి సమానమని వివరించారు. ప్రజల ఇబ్బందులు, విలువైన ప్రాణాల నష్టం వంటివి కలుపుకుంటే అసలు వ్యాక్సిన్ లకు కట్టిన డబ్బు లెక్కలోకే రాదన్నారు.